Saturday, May 4, 2024

మేలైన విత్తనాలతోనే అధిక దిగుబడి, విత్తన మేళాలో రైతులకు సూచ‌న‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : అధిక దిగుబడి కోసం మేలైన విత్తనం ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ‘విత్తన మేళా’లో రైతులకు వివరించనున్నట్లు ఆచార్య జయశంకర్‌ యూనివర్సిటీ వీసీ డా. వీ. ప్రవీణ్‌రావు తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆడిటోరియం వద్ద విత్తన మేళ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మేళా ఏర్పాట్లపై పరిశోధానా విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.జగదీశ్వర్‌తో కలిసి అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ… విత్తన మేళాకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. మేళాలో ఎనిమిది పంటలకు చెందిన 44 రకాల విత్తనాలను రైతులకు విక్రయిస్తామని చెప్పారు. సుమారు 15వేల క్వింటాళ్ల విత్తనాలను విక్రయించనున్నట్లు చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు వివరించేందుకు రైతు సదస్సును నిర్వహిస్తున్నామన్నారు.

రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయశాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలోని నూనెగింజల పరిశోధనా సంస్థ, వరి పరిశోధనా సంస్థ స్టాళ్లను ఏర్పాటు చేసి రైతులకు నూతన వంగడాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరించనున్నామని తెలిపారు. వ్యవసాయ అనుబంధ శాఖలు, సంస్థలు ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. విత్తన మేళాను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా, పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థతో పాటు వరంగల్‌, జగిత్యాల పరిశోధనా సంస్థల్లోనూ విత్తనమేళాలు జరుగుతాయన్నారు. పలు రకల విత్తనాలను మేళాల్లో విక్రయిస్తామని చెప్పారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని ప్రధాన పరిశోధనా కేంద్రాల్లో విత్తనమేళా జరుగుతుందని, అందుబాటులో ఉన్న మేళాలను రైతులు సదర్శించి మేలైన విత్తనాలను సేకరించుకోవాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement