Wednesday, April 24, 2024

కొత్త గ్రామ పంచాయతీలకు త్వ‌ర‌లోనే పక్కా భవనాలు.. వెల్ల‌డించిన మంత్రి ఎర్ర‌బెల్లి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: త్వరలో కొత్త గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర మంత్రులు తెలిపారు. సోమవారం ఖైరతాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అధ్యక్షతన ఎస్టీ గ్రామాల్లోని రోడ్లు, డ్రైనేజీ, కొత్త గ్రామ పంచాయతీ భవనాలు మౌలిక వసతుల కల్పన అంశాలపై సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. కొత్త పంచాయతీలకు పక్కా భవనాలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు త్వరలో ఎస్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైఈ అంశంపై విస్త్రతంగా చర్చిస్తామన్నారు. అలాగే నిధుల మంజారు అంశంపై త్వరలో ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావుతో భేటీ అవుతామన్నారు.

కొత్త గ్రామ పంచాయతీలకు భవనాలు, మౌలిక సదపాయాల కోసం సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించారని మంత్రులు తెలిపారు. అదివాసీ తెగల గూడెలలో రోడ్ల నిర్మాణం కోసం పంచాయతీ రాజ్‌ శాఖ రూ.70 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ రూ.70 కోట్లు కలిసి మొత్తం రూ.140 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని 2400 కొత్త గ్రామపంచాయతీల్లో భవనాల నిర్మాణం కోసం పంచాయతీ, గిరిజన సంక్షేమ శాఖ కలిపి మొత్తం రూ.600 కోట్లు కేటాయించిందన్నారు. ఇదిలావుండగా జూన్‌ 3వ తేదీ నుంచే ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement