Friday, April 26, 2024

వ‌చ్చే రెండు వారాలే కీల‌కం…

మే 20 దాకా సెకండ్‌వేవ్‌ తీవ్రం
తెలంగాణ పరిస్థితిపై కాన్పూర్‌ ఐఐటీ అంచనా
జూన్‌ నుండి కేసులు తగ్గుముఖం
జూన్‌ 21 నాటికి స్థిరత్వం
కేసులు తగ్గినా జాగ్రత్తగా ఉండాల్సిందే

హైదరాబాద్‌, : కరోనా సెకండ్‌వేవ్‌ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసుల తీవ్రత పెరుగుతూ.. ఆస్పత్రుల్లోనూ సౌకర్యాలు దొర కని దుస్థితి ఏర్పడింది. కరోనా కేసుల తీవ్రత ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉండడంతో ఏ రాష్ట్రంలో కేసుల తీవ్రత ఎప్పుడు తగ్గుముఖం పడుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణలో కరోనా కేసులు ఎప్పటి నుంచి తగ్గుముఖం పడుతాయనే అంశంపై కాన్పూర్‌ ఐఐటీ అంచనాకు వచ్చింది. మే 20వరకు సెకండ్‌ వేవ్‌ తెలంగాణలో తీవ్రం గా ఉంటుందని వారు అంచనా వేశారు. జూన్‌ నుంచి తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతా యని ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ మనీంద్రా అగర్వాల్‌ తెలిపారు. కరోనా కేసుల విషయంలో కంప్యూటేషనల్‌ మోడల్‌ ద్వారా వివరించిన ఆయన మే 20 నుంచి తెలంగాణలో కేసుల లోడ్‌ అనేది తగ్గుతూవస్తుందని తెలిపారు. కేసులు తగ్గి జూన్‌ 21 నాటికి స్థిరత్వం వస్తుందని అన్నారు. జూన్‌ 21 నుంచి కరోనా కేసులు తగ్గవచ్చని తెలిపారు. కరోనా కేసులు తగ్గినా.. ప్రజలంతా కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. మాస్క్‌ తప్పనిసరిగా ధరించడం, భౌతికదూరం పాటించడం, అత్యవసరమైతే తప్ప బయటకురాకపోవడం కఠినంగా పాటించాలన్నారు.
బెడ్లు ఫుల్‌
తెలంగాణలో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. వైద్యం అవసరం అయిన వారికి బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రుల్లో చికిత్స అవసరం లేని కొందరు కరోనా పేషంట్లు కూడా ఆసుపత్రుల్లో చేరడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఖచ్చితంగా అవసరమున్నవారికే.. బెడ్‌ ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించినా, ఆర్ధిక స్థోమత ఉన్నవారికే.. లక్షల బిల్లులు చెల్లించగలిగేవారికి బెడ్లు దక్కుతున్నాయి. మే 20 వరకు సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉంటుందని కాన్పూర్‌ ఐఐటీ అంచనా వేయగా, కట్టడి చేయకుంటే.. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని, ఇప్పటికే ప్రతిరోజూ వినిపిస్తున్న మరణవార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కఠినంగా కట్టడి చేయాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించాలంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో నైట్‌ కర్ఫ్యూ అమలవుతుండగా, 8వ తేదీ ఉదయం వరకు ఇది కొనసాగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement