Monday, April 29, 2024

TSRTC | ఇదిగో మన ఆర్టీసీ చరిత్ర.. 90 ఏళ్ళు దాటిన సుధీర్ఘ ప్రయాణం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు గొప్ప పేరుంది. నాటి నైజాం నవాబు పాలనలో స్థాపించిన సంస్థ ఇంతింతై.. వటుడింతై.. అన్నట్లుగా 90 ఏళ్ళు దాటిన సుదీర్ఘ ప్రయాణంలో అనేక మైలురాళ్ళను అధిగమించింది. నాడు 27 బస్సులు, 166 మంది ఉద్యోగులతో 1932 ప్రారంభమైన మన ఆర్టీసీ, నేడు 9,384 బస్సులతో, 43వేలు దాటిన ఉద్యోగులతో ప్రపంచ రికార్డు సృష్టించింది. చివరకు శ్రకు తగిన ఫలితాన్ని పొందుతూ ప్రభుత్వ సంస్థగా అవతరించింది.

తొమ్మిది దశాబ్దాల చరిత్ర కల్గిన తెలంగాణ ఆర్టీసీ మరింత ప్రగతి చక్రంపై దూసుకెళ్తోంది. నిజాం కాలంలో అంటే 1932వ సంవత్సరంలో ప్రారంభమైన ఆర్టీసీ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. అనేక అద్భుతమైన రికార్డులతో దూసుకెళ్తున్న ఆర్టీసీని అప్పట్లో నిజాం రాష్ట్ర రైల్వే – రోడ్డు రవాణా శాఖ అని పిలిచేవారు. 27 బస్సులు, 166 మంది సిబ్బంది ఉండేవారు. స్వాతంత్య్రం తర్వాత 1951 నవంబర్‌ ఒకటో తేదీన హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనం అయింది. ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 1958 జనవరి 11వ తేదీన ఏపీఎస్‌ ఆర్టీసీగా మారింది.

- Advertisement -

ఉమ్మడి రాష్ట్రంలో 22 వేల 628 బస్సులతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ రవాణా వ్యవస్థగా చరిత్ర సృష్టించింది. 1999లో గిన్నిస్‌ రికార్డు కూడా సాధించింది. 2014వ సంవత్సరంలో రాష్ట్ర విభజన అనంతరం 2015 జూన్‌ 3వ తేదీన తెలగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా రూపాంతరం చెందింది. అప్పటికీ సంస్థకు 98 డిపోలు ఉన్నాయి. టీ-ఎస్‌ ఆర్టీసీకి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్‌ 7వ తేదీన ఆర్టీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు- చేసింది.

మన తెలంగాణ ఆర్టీసీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌కు సర్వీసులు నడుపుతోంది. రోజుకు సుమారు 90 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 9 వేల 384 బస్సులు ఉన్నాయి. ఇందులో 68 శాతం అంటే సుమారు 6 వేల 300 బస్సులు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 43,373 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 364 బస్‌ స్టేషన్లు ఉన్నాయి.

నాడు జీతాల కోసం అప్పులు

అయితే, గత కొన్నేళ్ల క్రితం ఆర్టీసీ చాలా గొప్పగా ఉండేది. పల్లెల్లోని చాలా మంది ప్రజలు ప్రయాణానికి ఆర్టీసీ బస్సులనే వాడేవాళ్లు. అలాగే ఆఫీసులకు వెళ్లాలన్నా ఎక్కువ మంది దీన్నే నమ్ముకునే వారు. కానీ కాలానుగుణంగా ప్రజలు అందరూ వ్యక్తిగత వాహనాలు, ప్రైవేటు వాహనాలు, క్యాబ్‌ లు, ఆటోలు ఇలా అన్నింటి వల్ల ఆర్టీసీ చాలా నష్టాలను చివచూసింది. నాటి ప్రభుత్వ నిర్లక్ష్యంతో అప్పుల్లో కూరుకుపోయింది. జీతాలకు కూడా అప్పులు తేవాల్సిన పరిస్థితి వచ్చింది.

వేల కోట్ల ఆస్తులు తనఖా..

ఇలా సంస్థకున్న వేల కోట్ల ఆస్తులను తనఖా పెట్టాల్సి దుస్థితికి చేరుకుంది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్‌ తొలి నుంచి ఆర్టీసీకి అండగా నిలుస్తున్నారు. ప్రజా జీవితంలో భాగమైన ఆర్టీసీకి ఏటా బడ్జెట్‌ లో భారీగా నిధులు కేటాయిస్తూ వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారు చేసిన సేవలకు గుర్తింపుగా మొదట 43 శాతం ఫిట్‌ మెంట్‌ ప్రకటించారు. నిర్వహణకు డబ్బుల కోసం ప్రభుత్వం గ్యారంటీగా ఉంటూ అనేక రుణాలు ఇప్పంచింది. అయినా నష్టాలు, కష్టాల బాటలోనే ప్రయాణించడంతో తమను ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని సీఎం కేసీఆర్‌కు కార్మికులు విజ్ఞప్తి చేశారు. తాజాగా ప్రభుత్వం వారికి శుభవార్త చెబుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇది శ్రమకు తగిన ఫలితం : సజ్జనార్‌

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీ-ఎస్‌ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర కేబినేట్‌ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం అని ట్విట్టర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంస్థలోని దాదాపు 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం ఇదంటూ వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా నిబద్దతతో పని చేస్తున్న సిబ్బంది శ్రమను గుర్తించి.. వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి టీ-ఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున కృతజ్ఞతలు చెప్పారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ నిర్ణయంతో సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి, ప్రజా రవాణా వ్యవస్థను తెలంగాణలో మరింతగా ప్రజలకు చేరువ చేస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement