Thursday, May 9, 2024

Karimnagar – దశాబ్దిలోనే ఆధ్యాత్మిక, అభివృద్ధి, ఆహ్లాదాన్ని కేరాఫ్ గా కరీంనగర్ … గంగుల

క‌రీంన‌గ‌ర్ – తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దశాబ్ది కాలంలోనే అభివృద్ధికి కెరాఫ్ గా కరీంనగర్ జిల్లా మారిందని రాష్ట్ర బిసి సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు . ” మనకోసం మన కరీంనగర్ కోసం” అన్న నినాదంతో కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆరోగ్యం ఫిట్నెస్ పై అవగాహన కల్పించడానికి కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ ఆదివారం ఉదయం నిర్వహించిన మారథాన్ కేబుల్ బ్రిడ్జి వద్ద మంత్రి జెండా ఊపి మారధాన్ని ప్రారంభించి జిల్లా కలెక్టర్, కమిషనర్ లతో కలసి బ్రిడ్జ్ పై నడిచారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాకే తలమానికంగా నిర్మిస్తున్న రివర్ ఫ్రంట్ పనులు ఒకసారి పూర్తయ్యాయి అంటే ఆధ్యాత్మికంగా, అభివృద్ధి, ఆహ్లాదానికి కెరాఫ్ గా కరీంనగర్ జిల్లా నిలుస్తుందని అన్నారు. గతంలో అభివృద్ధిని నోచుకోకపోవడంతో కరీంనగర్ జిల్లా అనగానే పనిష్మెంట్ ఇవ్వాలంటే జిల్లాకు పంపించాలని భావించేవారని , కరీంనగర్ జిల్లా అంటే పనిష్మెంట్లకు కేంద్రం కాదని జిల్లాకు రావాలి అని కోరుకునే విధంగా తీర్చిదిద్దాలని అనుకున్నానని, ఒకప్పుడు జిల్లాలో రోడ్లను అనుకుని చెత్తాచెదారం, మురుగు వాటి చుట్టూ పందుల స్వైర విహారంతో జిల్లా కేంద్రంలో ఆటోలో రోడ్లపై వెళ్లలేని పరిస్థితులు ఉండేవని, రాష్ట్రం ఆవిర్భవించిన దశాబ్ది కాలంలోనే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చేపట్టిన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, చూద్దామన్నా కనబడని గుంతలు, కళ్ళు జిగేలుమనే విద్యుత్ దీపాలతో పాటు మానేరు పై నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణాలతో హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందిన జిల్లాగా కరీంనగర్ రూపాంతరం చెందిందని. మరో సంవత్సరంలో రివర్ ఫ్రంట్ పనులు పూర్తీ చేసుకొని ప్రపంచస్థాయిలో కలలో కూడా ఊహించని విధంగా అద్భుత పర్యాటక ప్రాంతంగా కరీంనగర్ జిల్లా నిలువనుందని తెలిపారు. ఒకవైపు ఐటీ టవర్ మరొక వైపు మెడికల్ కళాశాల , వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీకృష్ణుని టెంపుల్ నిర్మాణాలతో భావితరానికి అద్భుతమైన నగరాన్ని అందించే విధంగా కరీంనగర్ జిల్లా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి మాట్లాడుతూ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా మారథాన్ నిర్వహించడం గొప్ప విషయమని, ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యం, ఫిట్నెస్ పై మరింత ఆసక్తి పెంపొందించాలని అన్నారు.

కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పి మహేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 10 సంవత్సరాల వయసు నుండి వయోవృద్ధుల వరకు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారని అన్నారు. ఇంతకు ముందు కరీంనగర్ ప్రజలు మారధన్ ఈవెంట్లో పాల్గొనడానికి హైదరాబాద్, బొంబాయి, చెన్నై లాంటి మహానగరాలకు వెళ్ళే వారన్నారు. తొలిసారి కరీంనగర్లో మారథాన్ ఏర్పాటు చేయడం ద్వారా కరీంనగర్ ప్రజలకు ఆరోగ్యం ఫిట్నెస్ లపై అవగాహన
కల్పించడం జరిగిందన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా 10 కిమి.,21కిమి కేటగిరిలలో మహిళలకి మరియు పురుషులకి విడివిడిగా ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను వజ్ర హాస్పిటల్స్ డాక్టర్ సుమన్ దంపతులు, ivy& సిద్ధార్థ స్కూల్ చైర్మన్ లు ప్ర‌దానం చేశారు.

ఈ కార్యక్రమంలో సిపి సుబ్బారాయుడు, కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement