Tuesday, May 21, 2024

Followup : గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యే కొడుకు.. దర్యాప్తు చేస్తున్న ఏసీపీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జూబ్లిహిల్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన మైనర్‌ బాలికపై అత్యాచార ఘటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు మరోసారి బాధిత బాలిక స్టేట్‌మెంట్‌ తీసుకోవాలని నిర్ణయించారు. కేసు దర్యాప్తు బాధ్యతను జూబ్లిహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌కు అధికారులు అప్పగించారు. ఇక ఈ కేసుకు సంబంధించి పక్కా ఆధారాలు, స్టేట్‌మెంట్లు సేకరించాలని నిర్ణయించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వారిలో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆధారాలను బయటపెట్టడంతో పోలీసులు కేసును అన్ని కోణాలలో నుంచి పరిశీలించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తగా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.
బాధిత బాలిక నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్న అనంతరం మొదటి నుంచి పలు పార్టీలు, వర్గాల నుంచి వస్తున్న ఆరోపణలను కూడా పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యే కుమారుడిని కూడా దోషిగా చేర్చాలని పోలీసులు నిర్ణయించారు. తనపై లైంగిక దాడి జరిగిందంటూ బాలిక ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఆధారంగా చేసుకుని జుబ్లిహిల్స్‌ పోలీసులు ఐదుగురిని నిందితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఉమర్‌ఖాన్‌ అనే యువకుడిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మేజర్లు ఇద్దరిని చంచల్‌గూడ జైలుకు, మైనర్లను జువైనల్‌ హోంకు పోలీసులు తరలించారు.

ఫోరెన్సిక్‌కు రఘునంద్‌ వీడియో క్లిప్పింగ్‌లు..

మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు విడుదల చేసిన వీడియో క్లిప్పింగ్‌లను పోలీసులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. క్లిప్పింగ్‌లు ఎమ్మెల్యేకు ఎలా చేరాయన్న అంశంపై అంతర్గత విచారణను కూడా మొదలు పెట్టారు. మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగిందన్న ఫిర్యాదు అందిందని, అయితే అత్యాచారానికి పాల్పడ్డ వారిలో ఎమ్మెల్యే కొడుకు లేడంటూ పోలీసులు క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనలు, ప్రజాగ్రహాన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఎమ్మెల్యే విడుదల చేసిన వీడియో ఆధారంగా కూడా కేసు దర్యాప్తు జరపాలని నిర్ణయించారు. తొలుత బాలిక తనపై అత్యాచారం జరిగిందంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చినపుడు కారులో ఐదుగురు యువకులు లైంగిక దాడి చేశారని పేర్కొంది. బాలిక స్టేట్‌మెంట్‌ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు ఎవరన్నది గుర్తించి వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నలుగురిని అరెస్టు చేయగా, మరొకరి కోసం గాలిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే రఘునందన్‌రావు విడుదల చేసిన ఫొటోలలో ఎమ్మెల్యే కుమారుడున్నట్లు తేలడంతో ఉలిక్కి పడ్డ పోలీసులు కేసును తిరిగి మొదటి నుంచి దర్యాప్తు చేయాలని నిర్ణయించి ఏసీపీ స్థాయి అధికారికి బాధ్యతలను అప్పగించారు. బాలిక స్టేట్‌మెంట్‌ తీసుకున్న అనంతరం అవసరమైతే ఎమ్మెల్యే కుమారుడిని ఆరవ నిందితుడిగా చేర్చనున్నారు.

రెండవ రోజూ కార్లను పరిశీలించిన క్లూస్‌ టీం..

ఇంకో పక్క పోలీసులు స్వాధీనం చేసుకున్న ఇన్నోవా కారుతో పాటు బెంజ్‌ కారును క్లూస్‌టీం, సాంకేతిక బృందం ఆదివారం మరోసారి పరిశీలించాయి. ఇన్నోవా కారులో తనపై అఘాయిత్యం జరిగిందని బాలిక చెప్పిందని పోలీసులు పేర్కొంటుండగా, ఎమ్మెల్యే రఘునందన్‌రావు విడుదల చేసిన ఫొటోలలో బెంజ్‌ కారులోనే బాలికపై అఘాయిత్యానికి పాల్పడింది బెంజ్‌కారులో అన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో పోలీసులు మరోసారి స్వాధీనం చేసుకున్న రెండు కార్లలో ఆధారాలను సేకరించారు. బాలికను బెంజ్‌ కారులోనే తీసుకు వెళ్ళిన యువకులు అందులోనే అఘాయిత్యానికి పాల్పడ్డట్లు ఏమైన ఆధారాలున్నాయా అంశంపై ప్రత్యేకంగా పరిశీలించారు.

- Advertisement -

ఇప్పటి వరకు ఈ కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సాదుద్దీన్‌ అహ్మద్‌ (ఎంఐఎం నేత కుమారుడు), ఉమర్‌ఖాన్‌ (ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు), మైనర్‌ 1 (వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ కుమారుడు), మైనర్‌ 2 ఎంఐఎం కార్పొరేటర్‌ కుమారుడు), మరో మైనర్‌ (సంగారెడ్డి మునిసిపల్‌ కౌన్సిల్‌ కో ఆప్షన్‌ మెంబర్‌ కుమారుడు) ఉన్నారు. తాజాగా కేసును మొదటి నుంచి దర్యాప్తు చేయాలని పోలీసులు నిర్ణయించడంతో అన్ని ఆధారాలుంటే ఎమ్మెల్యే కుమారుడిని ఆరవ నిందితుడిగా చేర్చే అవకాశాలున్నాయి. పబ్‌లో జరిగిన పార్టీతో పాటు బాలికతో పాటు ఎమ్మెల్యే కుమారుడు వెళ్ళినప్పటికీ మార్గమధ్యలోనే వాహనం దిగి వెళ్ళిపోయాడని పోలీసులు ఇంతవరకు చెప్పారు. అయితే రఘునందన్‌ విడుదల చేసిన వీడియోలో ఎమ్మెల్యే కుమారుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆచితూచీ విచారణ జరిపి, ఆధారాలను పూర్తి స్థాయిలో సేకరించాలని దర్యాప్తు బృందం నిర్ణయించింది.

సమగ్రనివేదిక ఇవ్వండి – సీఎస్‌, డీజీపీలను ఆదేశించిన గవర్నర్‌

మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఘటనపై గవర్నర్‌ తమిళిసై స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. జరిగిన ఘటనపై రెండు రోజులలో పూర్తి స్థాయి నివేదిక అందించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సీఎస్‌ సోమేష్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డిలను కోరారు. మీడియాలో వస్తున్న కథనాలను నిశితంగా పరిశీలించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరమంటూ తమిళిసై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

42 మంది బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు..

మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందన్న ఫిర్యాదు అందినప్పటికీ కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం జూబ్లిహిల్స్‌ పోలీసుస్టేషన్‌ ముట్టడి జరిగింది. ఈ ముట్టడిలో పాల్గొన్న 42 మంది బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదైంది. మీడియా కథనాల ఆధారంగా ఆందోళనకారులను పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా మరింత మందిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement