Thursday, October 31, 2024

First Sign – మంత్రిగా కొండా సురేఖ తొలి సంత‌కం చేసిన ఫైల్ ఇదే …..

హైద‌రాబాద్ – వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంచే ఫైల్‌పై మంత్రి కొండా సురేఖ తొలి సంతకం చేశారు. ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ మంత్రి సంతకం చేశారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ సచివాలయంలో ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలకు ఏనుగులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునేందుకు అనుమతిని ఇస్తూ మరో ఫైల్‌పై కూడా మంత్రి సంతకం చేశారు.

ఆ తర్వాత అటవీ శాఖపై సమీక్ష నిర్వహించారు. హరితహారం ద్వారా ఇప్పటి వరకు పచ్చదనం పెంపు, వచ్చే ఏడాది లక్ష్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీ, దేవాదాయ శాఖల్లో ప్రస్తుత సిబ్బంది, కొత్తగా నియామకాలకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. నిత్యం అందుబాటులో ఉంటానని, సిబ్బంది, అధికారులు నిజాయితీగా పనిచేయాలని సూచించారు. జట్టుగా పనిచేసి లక్ష్యాలు సాధిద్దామని.. పర్యావరణ రక్షణ, పచ్చదనం పెంపునకు అందరూ కార్యసాధకులుగా పనిచేయాలన్నారు. త్వరలోనే శాఖల వారీగా పూర్తి స్థాయి సమీక్షలు చేపడతామన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో తయారు చేసిన పోస్టర్లను ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు. కొండా సురేఖ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు, అటవీ, ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరై అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement