Monday, April 29, 2024

Blue Revolution | విస్తృతంగా జలవనరులు.. ఫిషరీస్ హబ్‌గా కరీంనగర్: పిట్ట‌ల ర‌వీంద‌ర్‌

విస్తారమైన జల వనరులున్న‌ కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన “ఫిషరీస్ హబ్” గా తీర్చిదిద్దేందుకు అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తోంద‌న్నారు రాష్ట్ర ఫిష‌రీస్ ఫెడ‌రేష‌న్ చైర్మ‌న్ పిట్ట‌ల ర‌వీంద‌ర్‌. అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్ ప్రెస్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పిట్టల రవీందర్ మాట్లాడారు. గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు దానికి అనుసంధానంగా నిర్మించిన రిజర్వాయర్లు వరద కాలువ గోదావరి గర్భాన్ని నీటి నిలువ కాలువగా వినియోగించడం మిషన్ కాకతీయ తదితర చర్యల ఫలితంగా కరీంనగర్ జిల్లాలో నీటి వనరుల సౌలభ్యం గరిష్ట స్థాయిలో అందుబాటులోకి వచ్చిందన్నారు. దాంతో పాటు ఉమ్మడి జిల్లా పరిధిలో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు తదితర సాంప్రదాయ జల వనరుల ఫలితంగా చేపల ఉత్పత్తికి అనేక అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ఎల్లంపల్లి, మిడిమనేర్, లోయర్ మానేర్, తదితర జలాశయాలతో పాటు గోదావరి నదిపై కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీలతో జ‌ల‌వన‌రులు పెరిగాయ‌న్నారు. మేడిగడ్డ నుండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరకు సుమారు 150 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న గోదావరి నది గర్భంలో నీటి వనరులకు కొదువ లేద‌న్నారు. వీటికి అనుసంధానంగా అందుబాటులోకి వచ్చిన సుమారు 122 కిలోమీటర్ల పొడవైన వరద కాలువ, గోదావరి ఉపనదిగా ఉన్న మానేరు ఉపనదిపై నిర్మించగలబెట్టిన అనేక చెక్ డ్యాములు ఉండ‌బోతున్న‌ట్టు తెలిపారు. ఇక‌.. సాంప్రదాయంగా అందుబాటులో ఉన్న వేలాది చెరువులు, కుంటలు తదితర జలవనరులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మత్స్య రంగంతోపాటు ఆక్వా కల్చర్ అభివృద్ధికి అనుకూలంగా మారిందని పిట్టల రవీందర్ అభిప్రాయపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా సముద్ర జల వనరుల్లో జరిగే చేపల ఉత్పత్తి రోజురోజుకు తగ్గుముఖం పడుతున్న కారణంగా ఉపరితల జల వనరులలో చేపల ఉత్పత్తికి అంతకంతకు ప్రాధాన్యం పెరుగుతున్నదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉపరితల జల వనరుల విస్తీర్ణంలో దేశంలో మూడవ స్థానంలో ఉన్న మన రాష్ట్రం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో అదనంగా మరో లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో జల వనరులు పెరగడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని పిట్టల రవీందర్ వెల్లడించారు. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో మత్స్య‌రంగం అభివృద్ధికి అవకాశాలు విస్తృతంగా పెరిగాయని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా లాంటి ప్రాంతాల్లో ఫిషరీస్ హబ్ ను రూపొందించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని పిట్టల రవీందర్ తెలిపారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మత్స్య రంగాన్ని ఆధునిక విధానాలతో మేళవించి ఆక్వా కల్చర్ తో అనుసంధానం చేయడం ద్వారా చేపల ఉత్పత్తిని, ఉత్పాదకతను ఇబ్బడి ముబ్బడిగా పెంచేందుకు విస్తారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల పరిధిలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆధునిక పద్ధతులలో చేపలను పెంచేందుకు వీలున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పిట్టల రవీందర్ వెల్లడించారు. ఈ విధానాలు అమలు చేయడం ద్వారా మత్స్య రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను విశేషంగా పెంపొందించేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాల పరిధిలో మత్స్య రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆ రంగానికి అనుబంధంగా చేప పిల్లల ఉత్పత్తి, చేపల దాన ఉత్పత్తి, ఫిష్ ప్రాసెసింగ్, వాల్యూ ఆడిషన్ తదితర అనుబంధ రంగాలు కూడా అభివృద్ధిలోకి వస్తాయని ఆయన అన్నారు. మత్స్య రంగానికి అనుబంధంగా మహిళ సాధికారికత ను సాధించేది కూడా వీలు కలుగుతుందని, ఇందులో భాగంగా చేపల పచ్చళ్లు, రొయ్యల పచ్చళ్లు, ఎండు చేపలు తదితర చేపల ఆహార పదార్థాలను దేశీయంగా మార్కెటింగ్ చేయడంతో పాటుగా విదేశాలకు కూడా ఎగుమతి చేయడానికి అవకాశాలు కలుగుతాయని, ఈ దిశలో రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement