Monday, May 6, 2024

Exclusive – సెటిల‌ర్స్ మ‌న‌స్సుల‌లో విష‌బీజాలా?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పదేళ్ల నుంచి సెటిలర్లను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం… రాష్ట్రవ్యాప్తంగా ఒక్కటంటే ఒక్క సంఘటన కూడా వారికి వ్యతిరేకంగా జరుగకుండా జాగ్రత్త తీసుకున్నాం… ఆయా ప్రాంతాల్లో వారి వృత్తులకు, వ్యాపారాలకు, వాణిజ్యానికి ఎటువంటి ఆటంకాలు రాకుండా, లేకుండా చూశాం… ఇప్పుడు కావాలని సెటిలర్ల మనస్సుల్లో గులాబీ జెండాపై విషబీజాలు నాటిందెవరు? అందుకు ఆజ్యం పోస్తున్నదెవరు? ఎన్నికల వేళ ఎన్నడూ లేని విధంగా విషప్రచారం ఎందుకు జరుగుతోంది? దీని వెనుక కుట్ర కోణం ఏమిటన్నది భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ఇంటిలిజెన్స్‌ బృందం ద్వారా సేకరించినట్టు చెబుతున్నారు!

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రాంత సెటిలర్లపై ఈగ కూడా వాలనివ్వనని, సొంత బిడ్డల్లా చూసుకుంటానని గులాబీ బాస్‌ ప్రత్యేకంగా పలుసార్లు హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగానే సెటిలర్లు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ గులాబీ జెండాను ఆదరించారు. ప్రతి ఎన్నికల్లోనూ గత దశాబ్దకాలంగా ఆదరిస్తూ వచ్చారు. జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో క్యాంపులుగా ఉన్న ప్రాంతాలను పంచాయతీలుగా విశేష అభివృద్ది చేశారు. పట్టణ, నగర ప్రాంతాల్లో కూడా వారి వృత్తి వ్యాపారాలకు ఎటువంటి అవరోధాలు లేకుండా నిరాటంకంగా సాగాయి. ఇందు కు పార్టీ ఎంతో వెన్నుదన్నుగా నిలబడింది.

ప్రభుత్వ పథకాలను కూడా ఎటువంటి బేధభావం లేకుండా సెటలర్లకు కూడా అందరికీ ఇచ్చినట్టే అందించారు. ఇక భాగ్యనగరంలో అయితే, ఒక్క ఆంధ్రప్రాంత వారనే కాకుండా దేశవ్యాప్తంగా ఇక్కడికి వచ్చి వృత్తి వ్యాపారాలు చేసుకుంటున్న అందరికీ సమానావకాశాలనే కల్పించారు. ప్రభుత్వం నుంచి అందించే అన్ని సదవకాశాలను వారికి ఎటువంటి వివక్ష లేకుండా అందించి ఆదరించారు. ఆంధ్రప్రాంత సెటిలర్లు భారాస అభ్యర్ధులుగా నిలుచున్నా వారిని స్థానికులు తమ వారిగానే పరిగణించి గెలిపించారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సెటిలర్ల నుంచి అంతేస్థాయిలో భారాసకు మద్దతు కనిపించింది.


వాస్తవానికి తాము సెటిలర్లమన్న విషయాన్ని ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎప్పుడో మరచిపోయారు. ఇక్కడే తమ కార్యకలాపాలను అందరిలానే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిస్తున్నారు. స్థానికు లతో ఎప్పుడో కలిసిపోయారు. వారిని విడదీసి చూసే పరిస్థితులు మచ్చుకు కూడా లేవంటే అతి శయోక్తి కాదు. శుభాశుభ కార్యక్రమాలను కూడా అందరూ కలిసే చేసు కుంటున్నారు. పండుగలు, పబ్బాలు, తదితర ఉత్స వాలు కూడా అలానే జరుగు తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు స్వార్ధపరులు తెరవెనుక కుట్రకు తెరలేపారు. ఏపీలో జరిగిన కొన్ని పరిస్థితులను, పరిణామాలను వక్రీకరించి సెటిలర్ల మనస్సులను కలుషితం చేశారు. వాస్తవానికి ఏపీ ఘటనలకు, తెలంగాణ సెటిలర్లకు ఎటువంటి సంబంధాలు లేవు. అలాగే, అక్కడి ప్రభుత్వ పాలసీలకు భారాస ప్రభుత్వ విధానాలకు సంబంధం లేదు.

- Advertisement -

కాని, ఇదే అదనుగా కొందరు స్వార్ధపరులు ఆయా ఘటనలకు ఇక్కడ జరుగనున్న అసెంబ్లి ఎన్నికలకు ముడిపెట్టారు! భారాసకు వ్యతిరేకంగా ప్రతి అంశాన్ని బూతద్దంలో ఫోకస్‌ చేసి సెటిలర్లను అయోమయంలో పడేసి అనుమానం కలిగించేవిధంగా పదేపదే ప్రచారం చేశారు… చేస్తున్నారు. తెలంగాణ జనజీవన స్రవంతిలో ఏనాడో కలిసిపోయిన ఆంధ్రప్రాంత వలస కుటుంబాల వారు ఇక్కడ ఎంతో స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతుకుతూ ఉపాధి పొందుతుంటే వారిని విడగొట్టి చూడడం, విషబీజాలు నాటడం వెనుక భారీ కుట్రే దాగి ఉందని భారాస అధినేత పసిగట్టారు. ప్రత్యేక ఇంటిలిజెన్స్‌ బృందం ద్వారా సమాచారాన్ని సేకరించి, దీనివెనుక ఎవరెవరు ఉన్నదీ తెలుసుకున్నారు.

కొన్ని కేసుల్లో కూడా ప్రభుత్వం ముందూ వెనుక ఆలోచించి చర్యలు తీసుకోలేదని, సెటిలర్ల మనస్సు గాయపడే చర్యలేవీ చేపట్టలేదని భారాస నేతల వద్ద ఓటుకు నోటు కేసును ఉదహరిస్తూ కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్టు సమాచారం. అయితే, ఇంత భారీ కుట్ర వెనుక ఉన్న కొందరి దుర్మార్గాలను ఎన్నికల అనంతరం బయటపెట్టి వారి పీచమణచడానికి వెనుకాడేదే లేదని కూడా స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. పదేళ్లుగా ఇక్కడే వ్యాపారాలు చేసి, సంపాదించుకుని, తెలంగాణ నీళ్లు తాగి, తిండి తిని కీలక సమయంలో చీకటి రాజకీయానికి ఒడిగడుతున్న వారికి కచ్చితంగా గుణపాఠం నేర్పాల్సిందేనని, కోవర్ట్‌లను రోడ్డుపై నిలబెడదామని ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement