Sunday, April 28, 2024

TS | కాంగ్రెస్‌ టికెట్‌ దరఖాస్తులకు ముగింపు.. 25న లాస్ట్ డేట్‌!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. టికెట్ల కోసం వందలాదిగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ నెల 18 నుంచి మొదలైన దరఖాస్తులు పర్వరం.. శుక్రవారంతో ముగుస్తుంది. గురువారం వరకు ఎన్నికల్లో పోటీ చేసే అశావాహుల నుంచి 700లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇక ఒక రోజే మిగిలి ఉండటంతో మరో వంద వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. టికెట్‌ కోసం పోటీ పడే ప్రతి వ్యక్తి తన అనుచరులతో గాంధీభవవన్‌కు వచ్చి కోలాహలం చేస్తున్నారు.

కాగా, గురువారం ఒక్క రోజే పార్టీ టికెట్‌ కోసం దాదాపు 200 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోడంగల్‌ నియోజక వర్గం నుంచి ఆయన అనుచరులు దరఖాస్తును అందజేశారు. పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య జనగామ నుంచి, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ కామారెడ్డి కోసం, మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి నాగార్జున సాగర్‌, మరో తనయుడు మిర్యాలగూడ టికెట్‌ కోసం దరఖాస్తులు చేసుకున్నారు.

ముషిరాబాద్‌కు పార్టీ సీనియర్‌ నేత సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, హుస్నాబాద్‌ కోసం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఖానాపూర్‌ నియోజక వర్గం టికెట్‌ కోసం ఆ పార్టీ మహిళా నాయకురాలు చారులత రాథోడ్‌, మునుగోడు కోసం పున్నా కైలాష్‌ నేత, ఎల్బీనగర్‌ టికెట్‌ కోసం మల్‌రెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. కాగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితర సీనియర్లు శుక్రవారం దరఖాస్తులు అందజేయనున్నారు.

- Advertisement -

కాంగ్రెస్‌లో చేరిన మైత్రిగ్రూప్‌ చైర్మన్‌ కొత్త జయపాల్‌రెడ్డి
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో మైత్రిగ్రూప్‌ చైర్మన్‌ కొత్త జయపాల్‌రెడ్డి గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌లో పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని వందలాది మంది అనుచరులతో కలిసి గాంధీభవన్‌కు వచ్చారు. కరీంనగర్‌ అసెంబ్లిd నుంచి జయపాల్‌రెడ్డి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ధర్మం మాట్లాడిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌: పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌రెడ్డి
బీజేపీ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అర్వింద్‌ ఈవీఎంల విషయలో ధర్మం మాట్లాడారని పీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎంపీ అర్వింద్‌ మాట్లాడిన మాటలను ప్రజలు గమనిస్తున్నారని గురువారం ఆయన ఒక ప్రకనటలో పేర్కొన్నారు. ఇప్పుడు ఏపార్టీకి ఓటు వేసినా.. బీజేపీకి వేసినట్టేనని , మళ్లిd నరేంద్రమోడీ గెలుస్తారని చెప్పడాన్ని చూస్తుంటే ఈవీఎంల్లో మతలబు ఉందనే విషయం అర్థమవుతోందన్నారు. ఎంపీ అర్వింద్‌ గతంలోనే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని ఆయన ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement