Monday, April 29, 2024

Election Campaign – కామారెడ్డి జిల్లాకు గోదావ‌రి నీళ్లు తెచ్చి రైతుల కాళ్లు క‌డుగుతాం – కెటిఆర్

బిక్కనూర్ నవంబర్ 25 ప్రభ న్యూస్…. అసైన్డ్ భూములు సాగు చేసే రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి ప్రాంత అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఇక్కడికి రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అన్నారు. కొడంగల్ లో చెల్లని రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే చెల్లుతుందా అని ప్రశ్నించారు.

ఈ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ బిజెపి నాయకులకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ఏమి అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని గుర్తు చేశారు. అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. మూడవసారి అధికారంలోకి రాగానే మరిన్ని కొత్త పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కామారెడ్డి ప్రాంతానికి గోదావరి జలాలు అందించి ఈ ప్రాంత రైతుల కాళ్లు కడుగుతామని హామీ ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తూ ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి 3000 రూపాయలు అందిస్తామన్నారు. భారతదేశంలోనే కామారెడ్డి నియోజకవర్గంలో ఆదర్శంగా నిలిచే విధంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, రాష్ట్ర ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమలరెడ్డి, పట్టణ సర్పంచ్ వేణు, మండల భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు నరసింహారెడ్డి, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement