Monday, May 13, 2024

ఈ-స్టాంప్‌ విధానం అద్భుతం.. రిజిస్ట్రేషన్ల శాఖలో మరింత పారదర్శకత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పారదర్శకత అమలులో కీలక సంస్కరణలను అవలంభిస్తున్న రిజిస్ట్రేషన్ల శాఖ అత్యుత్త్తమ ఫలితాలను సాధిస్తోంది. సరికొత్త విధానాలతో రిజిస్ట్రేషన్ల శాఖ ప్రజలకు మరింత చేరువవుతోంది. నూతన విధానాలతో రాబడి పెంచుకోవడం, ప్రజలకు సేవల అందజేతలో మరింత నాణ్యతను కనబరుస్తోంది. అక్రమాలు అరికట్టడం, వివాదాలు లేని రిజిస్ట్రేషన్ల సేవలతో మంచి పేరు తెచ్చుకుంటోంది. ప్రజలకు మెరుగైన సేవలందించడంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్న తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ అమలులోకి తెచ్చిన ఈ-స్టాంప్స్‌ మ్యాడ్యూల్‌తో అద్భుత ఫలితాలు సాకారమవుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు మూడో అతిపెద్ద ఆదాయ వనరుగా నిల్చిన ఈ శాఖ లీకేజీలను అరికట్టడంలో సఫలమవుతోంది. కీలకమైన ఈ శాఖను ఆధునీకరించేందుకు ఉన్నతాధికారులు కీలక చర్యలు అవలంభించారు. గతంలో నాలుగు రకాల అధునాతన సేవలను అందుబాటులోకి తెచ్చిన రిజిస్ట్రేషన్ల శాఖ వినియోగదారులకు బ్యాంకులతో కలిగే ఇబ్బందుల నివారణకు ఈ-స్టాంప్స్‌ విధానాన్ని వెలుగులోకి తెచ్చింది.

దీని ద్వారా స్టాంప్‌ డ్యూటీ, బదిలీ సుంకం, రిజిస్ట్రేషన్‌ రుసుముల చెల్లింపు సులభతరమైంది. ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఈ-స్టాంప్స్‌ మాడ్యూల్‌ ద్వారా బ్యాంక్‌ చలాన్‌లు, బ్యాంక్‌ చెల్లింపుల్లో అద్భుతమైన పారదర్శకత వచ్చింది. ఈ విధానంతో డిజిగ్నేటెడ్‌ బ్యాంకుల్లోనే చెల్లించాల్సిన రుసుములకు ప్రభుత్వం స్వస్తి పలికింది. తద్వారా క్రయవిక్రయదారులకు జాప్యం నివారించబడి, క్రయవిక్రయదారులకు సులభతరంగా మారింది. రాష్ట్రంలోని 141 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు చెందిన రుసుముల చెల్లింపులన్ని ఏ బ్యాంకు నుంచి అయినా ఆన్‌లైన్‌లో చెల్లించే వెసులుబాటు కలిగింది. అంతేకాకుండా అప్పటివరకు అమలులో ఉన్న మాన్యువల్‌ చలాన్‌లను ప్రభుత్వం తొలగించింది.

ఇందుకు 775ఎస్‌బీహెచ్‌ బ్రాంచీలతో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా ఈ విధానంతో స్టాంప్‌ డ్యూటీని ప్రజలు స్వచ్ఛందంగా మదింపు చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో వెసులుబాటు కల్పించారు. ఈ స్టాంప్‌ మాడ్యూల్‌ ద్వారా ఇంటి నుంచే స్టాంపు డ్యూటీలు చెల్లించి గంటలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకునే విధానం అందుబాటులోకి వచ్చింది. పటిష్టమైన విధానం ద్వారా యునిక్‌ కోడ్‌ వినియోగదారుల సెల్‌నెంబర్‌కు పంపడంతో దుర్వినియోగం కట్టడైనట్లుగా రుజువైంది. ఆన్‌లైన్‌ చలాన్‌ ఒకసారి ఒకరికి మాత్రమే ఉపయోగపడుతుండగా, గతంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించిన దొంగ చలాన్ల వ్యవస్థకు చెక్‌ పడినట్లుగా రిజిస్ట్రేషన్ల శాఖ ఆనందం వ్యక్తం చేస్తోంది. 2 చలాన్‌ డాక్యుమెంట్‌కు అనుసంధానం చేయడం ద్వారా మాన్యువల్‌గా రాసే అవసరం లేకుండా పోయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement