Thursday, April 25, 2024

దోస్త్: డిగ్రీ చేయాలనుకునే విద్యార్థులకు మరో అవకాశం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మరో అవకాశం కల్పించింది. తల్లిదండ్రులు, విద్యార్థుల కోరిక మేరకు ప్రత్యేక ఫేజ్‌ దోస్త్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది. సీట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. ప్రత్యేకంగా స్పెషల్‌ ఫేజ్‌ రిజిస్ట్రేషన్‌ను అనుమతించింది. విద్యార్థులు ఈ నెల 6 నుంచి 20తేదీ వరకు రూ.400 ఫీజుతో డిగ్రీ కాలేజీలో సీటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్‌ ఆప్షన్లను కూడా ఈ నెల 6 నుంచి 20 వరకు ఇచ్చుకోవచ్చు. ప్రత్యేక దివ్యాంగులైన విద్యార్థుల సర్టిఫికెట్లను ఈ నెల 18న అన్ని యూనివర్సిటీల పరిధిలో పరిశీలిస్తారు. సీట్ల అలాట్‌మెంట్‌ను ఈనెల 24న ప్రకటిస్తారు. ప్రత్యేక కౌన్సిలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 24 నుంచి 26 వరకు రిపోర్టింగ్‌ చేయొచ్చు. డిగ్రీ కాలేజీల్లో అంతర్గత సీట్ల మార్పిడి కోసం ఈ నెల 27 నుంచి 29 వరకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంతర్గత కాలేజీల సీట్ల సర్దుబాటు లిస్టును ఈ నెల 30న ప్రకటిస్తారు.

రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఇంకా 2,19,693 సీట్లు మిగిలిపోయాయి. ఇప్పటి వరకు మూడుదశల్లో 197, 722 సీట్లను భర్తీ చేశారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకుని సీటు పొందని వారు ప్రత్యేక ఫేజ్‌ కౌన్సిలింగ్‌ కోసం ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. అయితే వెబ్‌ ఆప్షన్లలో సీటు వచ్చినా రిపోర్టు చేయని వారు మాత్రం ఈసారి రూ.400 కౌన్సిలింగ్‌ ఫీజును చెల్లించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement