Thursday, April 25, 2024

పెట్రో ధరలపై టీడీపీ ఉద్యమం.. ఏపీ సర్కార్ పై చంద్రబాబు ధ్వజం

చమరు ధరలపై కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని తగ్గించినా.. పలు రాష్ట్రాలు మాత్రం ట్యాక్స్ ను తగ్గించ లేదు. కేంద్రం బాటలోనే పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు అడుగులు వేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా తగ్గించాయి. దీంతో ఇప్పుడు తగ్గించని రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ వినిపిస్తోంది. పెట్రో ధరలపై పోరాటానికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది.

రాష్ట్రంలో పెట్రో ధరలు తగ్గించేవరకు టీడీపీ పోరాటం చేస్తుందని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు స్పష్టం చేశారు. ఈనెల 9న అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఆందోళనలు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల్లో కన్నా ఏపీలోనే పెట్రో ధరలు అత్యధికంగా ఉన్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గించాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో పెట్రో ధరలు ఎందుకు తగ్గించట్లేదని ఏపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు.  రాష్ట్రంలో పెట్రో ధరలు కనీసం రూ.16 వరకు తగ్గించి తీరాలన్నారు. ప్రజలంతా చైతన్యవంతులై జగన్ అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలని సూచించారు.

జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేశారని.. అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తానని గతంలో చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ ఏం సమాధానం చెబుతారని చంద్రబాబు ప్రశ్నించారు. అధికారం చేతుల్లో ఉందని ధరలతో ప్రజలను బాదుతారా? అంటూ మండిపడ్డారు. పెట్రో ధరల ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందన్నారు. పెట్రో ధరలు, నిత్యావసరాలు, మద్యం, ఇసుక, విద్యుత్, ఆర్టీసీ ఛార్డీల వంటివన్ని ఏపీలోనే అత్యధికంగా ఉన్నాయన్నారు. ఒక పక్క విధ్వంసం.. మరోపక్క ప్రజలపై భారం మోపుతూ జగన్ పాలన సాగిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.  

ఇది కూడా చదవండి: ఏపిలో రికార్డు స్థాయిలో తగ్గిన నిరుద్యోగం.. ఇదీ విజయసాయి లెక్క!

Advertisement

తాజా వార్తలు

Advertisement