Thursday, May 2, 2024

Davos – భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా దావొస్ పర్యటన – దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదారాబాద్ – తెలంగాణకు భారీఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తమ దావొస్ పర్యటన సాగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలతలు, బలాబలాలు, తమ ప్రాధాన్యతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక ద్వారా చాటి చెబుతామని తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ అధికారిక బృందం వెళ్తున్న నేపథ్యంలో సంబంధిత వివరాలను ఆదివారం నాడు ఓ ప్రకటనలో వెల్లడించారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో పాల్గొనాల్సిందిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఆహ్వానం అందిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి అని స్పష్టం చేశారు. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి తో పాటు ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి కూడా ఉన్నారు. విదేశీ, భారతీయ పారిశ్రామికవేత్తలను కలుసుకొని కొత్త ప్రభుత్వ విజన్ మరియు ప్రాధాన్యతలను వివరించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అవకాశం ఇస్తుందని అభిప్రాయపడ్డారు.

ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్ గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది చక్కటి వేదిక అని పేర్కొన్నారు. మూడు రోజుల దావోస్ పర్యటనలో తాను, ముఖ్యమంత్రి కలిసి దాదాపు 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవబోతున్నామని వెల్లడించారు. తాము సమావేశం కాబోతున్న వారిలో నొవర్తీస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజనిక, గూగుల్, యుబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల సీఈఓ లు, సీఎక్స్ఓ లు ఉన్నారని తెలిపారు.

భారత్ కు చెందిన టాటా, విప్రో, హెచ్ సీఎల్ టెక్, జేఎస్ డబ్లు, గోద్రెజ్, ఎయిర్ టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతో భేటీ అవ్వడమే కాకుండా సిఐఐ, నాస్కం వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతో సమావేశం అవుతామని వివరించారు. దావోస్ పర్యటన విజయవంతం కావడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదని, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్ మరియు ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

- Advertisement -

తొలిసారి దావోస్ పర్యటనలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక గౌరవం దక్కిందని, ఆయనను వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్ లో మాట్లాడవలసిందిగా ఆహ్వానించారని వెల్లడించారు. అక్కడ జరగబోయే చర్చగోష్టిలో పురోగమిస్తున్న వైద్యరంగంపై అభిప్రాయాలను పంచుకుంటారని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement