Sunday, May 5, 2024

CP Warns – ధర్నాలు చేసే క్రమంలో శృతిమించి ప్రవర్తిస్తే కఠిన చర్యలు …సిపి సుబ్బరాయుడు

కరీంనగర్ – వివిధ సమస్యలపై ధర్నాలు చేస్తున్న క్రమంలో కొందరు శృతిమించి ప్రవరిస్తున్నారని, ఇటువంటి సంఘాలు,నేతలు, సభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు హెచ్చరించారు.. ఈ మేర‌కు ఆయ‌న ఒక బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌ విడుద‌ల చేశారు..

అ ప్ర‌క‌ట‌న య‌ధాత‌థంగా మీకోసం..

ప్రజాస్వామ్యంలో సమస్యలు పరిష్కారం కోసం వివిధ రాజకీయ పార్టీలు ఉద్యోగ, మహిళ , విద్యార్థి కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు ధర్నాలు చేయడం సహజమే. ఈ ధర్నాలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి ఆ సమస్యకు పరిష్కారం కోసం చేసే ప్రయత్నంలో, ఒక సాధనం మాత్రమే. కరీంనగర్ లో కూడా వివిధ సంఘాల నాయకులు ప్రతినిధులు కలెక్టరేట్ ముందు ధర్నాలు చేయడం కూడా ఆనవాయితీగా వస్తూ ఉన్నది. కానీ ఇటీవలి కాలంలో ధర్నాలు చేసే పద్ధతిలో ఒక విపరీతమైన ధోరణి కనిపిస్తూ ఉన్నది. ధర్నాలు చేసే వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు తమ వ్యక్తిగత గుర్తింపు కోసం మరియు మీడియాలో సోషల్ మీడియాలో ప్రచారం కోసం పాకులాడుతూ కలెక్టరేట్ గేట్లు ఎక్కే ప్రయత్నం చేయడం, అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలెక్టరేట్ గేటు ఎక్కే మూకలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసులను కూడా తోసి వేయడం, వారితో ఘర్షణ పడడం ఈమధ్య పెరిగిపోతున్నది. దీనికి సోషల్ మీడియా ప్రభావం కూడా తోడవడంతో ప్రతి ఒక్కరు ధర్నాలలో గేట్లు ఎక్కే ఫోటోలు మరియు పోలీసులతో తోపులాడే ఫోటోలను వెంటనే సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ మొదలైన వాటిలో పెట్టుకుంటూ తమ గుర్తింపు కోసం పడే తాపత్రయం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది.

- Advertisement -

కలెక్టర్ కార్యాలయం ప్రజలకు సేవలందించే ఒక సేవ కేంద్రం. ప్రతినిత్యం సామాన్యుడి నుండి మొదలు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల వరకు వేలాదిమంది తమ తమ పనుల నిమిత్తం, సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ను సందర్శిస్తూ ఉంటారు. ఎంతోమంది వృద్ధులు, వికలాంగులు, మహిళలు కూడా దూర ప్రాంతాల నుండి తమ పనుల కోసం, లేదా సమస్యలు విన్నవించుకొనటానికి కలెక్టరేట్ కు వచ్చినప్పుడు ధర్నాల వల్ల తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యానికి గురవుతారు. గంటల తరబడి కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేస్తూ కార్యాలయంలోనికి వెళ్లే వారిని ఇబ్బందులకు గురి చేస్తే ప్రజలు ధర్నాలు చేసే సంఘాల నాయకులు ప్రతినిధులపై ఏహ్య భావాన్ని, వ్యతిరేక అభిప్రాయాన్ని ఏర్పరచునే అవకాశం ఉంది . ధర్నాలు చేసే సంఘాల రాజకీయ పార్టీలు మరియు వారి నాయకులు ప్రతినిధులు ఈ విషయాన్ని గమనించి ఒక క్రమ పద్ధతిలో, క్రమశిక్షణతో వారి ధర్నా కార్య్రమాన్ని కొన్ని నిమిషాల పాటు చేసుకుని మీడియా ద్వారా తమ సమస్యను విన్నవించుకోవడం, లేక తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువస్తూ వినతి పత్రాన్ని సమర్పించుకోవడం చేసుకొని వెంటనే వెళ్లిపోవాలి. అలా కాకుండా, గంటల తరబడి కలెక్టరేట్ కార్యాలయం ముందు కూర్చోవడం వల్ల సందర్శకుల రాకపోకలకే కాకుండా ఆ రోడ్డున వెళ్లే సాధారణ ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది.

ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పోలీసులు వారికి వివరించే ప్రయత్నం చేస్తే పోలీసులతో వాగ్వివాదానికి దిగడం, గేట్లు ఎక్కి లోపలికి వెళ్ళడానికి అత్యుత్సాహం ప్రదర్శించడం, పోలీసులను నెట్టివేయడం, లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. అలా చేయడం వల్ల తమకేదో గుర్తింపు వస్తుందని తమ కార్యక్రమం హైలైట్ అవుతుందని భ్రమ పడుతుంటారు. కలెక్టరేట్ కార్యాలయం ప్రజలది. అది ప్రజల ఆస్తి. ప్రత్యర్తి వర్గాల భూభాగం కాదని కూడా గ్రహించాలి. కార్యాలయం గేట్లు ఎక్కి, గోడలు దూకడం సాహస కార్యం కాదని గ్రహించాలి. . ఇలా చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదనే సత్యం గ్రహిస్తే మంచిది. భారతీయ శిక్షా స్మృతి లో ‘విధి నిర్వహణలో ఉన్న అధికారులతో వాగ్వివాదానికి దిగిన, దురుసుగా ప్రవర్తించిన, బెదిరింపులకు పాల్పడినా, నెట్టివేసిన, అరెస్టు చేసే క్రమంలో ప్రతిఘటించిన అది తీవ్రమైన నేరంగా’ స్పష్టంగా పేర్కొనడం జరిగింది.

కావున ధర్నాలు ప్రశాంతమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో కొన్ని నిమిషాలలో పూర్తి చేసుకుని , తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకొని రావడానికి వినతి పత్రము సమర్పించుకోవడం, లేదా మీడియా తో మాట్లాడి స్థలాన్ని ఖాళీ చేసి పోవడం చేయాలి. అలా కాకుండా అత్యుత్సాహం ప్రదర్శించి పోలీసులతో ఘర్షణకు దిగితే చట్టపరంగా క్రిమినల్ కేసులు తప్పవని తెలియజేస్తున్నాను.

– ఎల్ సుబ్బరాయుడు, ఐపిఎస్., కమిషనర్ ఆఫ్ పోలీస్ .. కరీంనగర్

Advertisement

తాజా వార్తలు

Advertisement