Tuesday, April 30, 2024

ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ అభ్యర్థుల రాతపరీక్ష..

క‌రీంన‌గ‌ర్ – పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో స్టెఫండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుల్ (సివిల్/ఎ.ఆర్/ టి.ఎస్.ఎస్.పి/ఎస్.పి.ఎఫ్/ఎస్.ఏ.ఆర్ సిపిఎల్/ఎస్.ఎఫ్.ఓ) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆదివారం నాడు జరిగిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్ధుల రాత పరీక్ష కోసం కరీంనగర్లోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల, శ్రీచైతన్య డిగ్రీ మరియు పిజి కళాశాల, అపూర్వ డిగ్రీ కళాశాల, వివేకానంద డిగ్రీ మరియు పిజి కళాశాల, ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ మరియు పిజి కళాశాల, తిమ్మాపూర్ మండలం రామకృష్ణాపూర్ కాలనీలోని వాగేశ్వరి కళాశాల, జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల, శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల, కరీంనగర్ లోని కిమ్స్ డిగ్రీ మరియు పిజి కళాశాల, వివేకానంద ఇంజనీరింగ్ కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం విదితమే.
పరీక్ష ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 01 గంటల వరకు కొనసాగింది. 14,188 మంది అభ్యర్థులకు గాను 14,020 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 168 మంది గైర్హాజర్ అయ్యారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు ఎస్ఆర్ఆర్ డిగ్రీ, పిజి కళాశాల, వివేకానంద ఇంజనీరింగ్ కళాశాల, తిమ్మాపూర్ మండలం రామకృష్ణాపూర్ కాలనీలోగల వాగేశ్వరి, నుస్తులాపూర్ లోని తిష్మతి, శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను పరిశీలించారు.
పరీక్షల సందర్భంగా ట్రాఫిక్ నకు ఎలాంటి అంతరాయం కలుగకుండా పటిష్ట క్రమబద్దీకరణ చర్యలు తీసుకున్నారు. పరీక్ష ముగిసేంతవరకు జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచారు. నగరంలోని లాడ్జిలను తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. క్యూపద్ధతి ద్వారా అభ్యర్థులను పరీక్షాహాల్లోకి అనుమతించారు. పురుష, మహిళ అభ్యర్థులను వేర్వేరుగా తనిఖీ చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల బయోమెట్రిక్ తో వివ‌రాలు న‌మోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement