Monday, May 20, 2024

Congress Vijaya Bheri – తెలంగాణాలో కాంగ్రెస్ గాలి… ఆరు గ్యారంటీల‌తో కెసిఆర్ ని ఇంటికి పంపుతాం -రాహుల్ గాంధీ

పెద్దపల్లి (ప్రభ న్యూస్) బిజెపి పై పోరాడితే తనపై కేసులు పెట్టి లోకసభ సభ్యత్వం రద్దు చేశారని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పై పోరాడితే తనపై అనేక కేసులు పెట్టి లోకసభలో అడుగుపెట్టకుండా సభ్యత్వం రద్దుచేసి ఢిల్లీలోని తన ఇల్లును లాక్కున్నారన్నారు. ప్రధాని మోడీ వేల కోట్ల రూపాయలు తన మిత్రులకు కట్టబెడుతున్నారని, నిరుపేదలకు చేసింది ఏమీ లేదన్నారు. నిరుపేదల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తామని నమ్మబలికి మోసగించారన్నారు. బిజెపి, బిఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని ఎక్కడ భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందో అక్కడ కెసిఆర్ ఎంఐఎం తో పోటీ చేయించి బిజెపికి లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. బిజెపికి బీ టీం గా బిఆర్ఎస్ వ్యవహరిస్తుందన్నారు.

దేశంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిలో నెంబర్ వన్ గా ఉన్నారన్నారు. లోపాయికారి ఒప్పందం వల్లే సీఎం అవినీతిపై కేంద్రం మౌనం వహిస్తుందన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి అందిస్తామని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలోని దళితులను మోసగించారని డబుల్ బెడ్ రూములు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గూడు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు సౌకర్యం కల్పిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టిన తొలి రోజున 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడంతోపాటు ప్రతి మహిళ ఖాతాలో 2500 ప్రతినెలా వేస్తామన్నారు.

కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. తెలంగాణకు వస్తే తనకు ఎంతో ఆనందం కలుగుతుందని, రాజకీయ సంబంధం కంటే కుటుంబ సంబంధం ఉందనిపిస్తోందన్నారు. సభలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు, సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్, విజయ రమణారావు, సీతక్క, మధుయాష్కి తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement