Sunday, April 28, 2024

TS: సీఎం రేవంత్ రెడ్డి చొరవతో… కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం..

రాచకొండ పోలీసు కమిషనరేట్ అంబర్ పేట పోలీసు హెడ్ క్వార్టర్స్ లో సొంగా శేఖర్ విధులు నిర్వర్తిస్తూ 2021 సెప్టెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అతని భార్య సత్యలత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందడంతో స్థానికత కారణం చూపుతూ రెండేళ్లుగా ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి గత ప్రభుత్వం నిరాకరించగా.. బాధితులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజావాణి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ కుటుంబ ధీనస్థితిని తెలపగా, సత్వరమే స్పందించిన ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో నిబంధనలు సడలించి ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ, రాచకొండ సీపీలకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం డీజీపీ రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వవలసినదిగా సీపీ రాచకొండకు ఉత్తర్వులు జారీ చేయగా, సీపీ రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా నియమిస్తూ అపాయింట్ మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా నిబంధనలు సడలించి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగంలో సమర్దవంతంగా నీతి, నిజాయితీతో పనిచేయాలని, భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని కమిషనర్ భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా కానిస్టేబుల్ శేఖర్ కుటుంబ సభ్యులు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రికి, డీజీపీ కి, సీపీ రాచకొండ కు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రా రెడ్డి, దివంగత కానిస్టేబుల్ శేఖర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement