Sunday, April 28, 2024

Kishan Reddy : కామారెడ్డి, గ‌జ్వేల్ లో కెసిఆర్ ఓట‌మి త‌ధ్యం.. క‌మ‌ల వికాసం ఖాయం …కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్ – అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందే రైతుబంధు ఎందుకు ఇవ్వలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గజ్వేల్‌, కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ ఓడిపోతున్నారని.. ఈ రెండు చోట్ల ప్రజల నుంచి భాజపాకు అద్భుత స్పందన వస్తోందని చెప్పారు. ఈ రెండు చోట్లా బీజెపి అభ్యర్థులు గెలుస్తున్నారని ఆయన తెలిపారు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తెలంగాణకు ప్రమాదకరమని సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. రైతుబంధు విష‌యంలో బిఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్న‌ద‌ని, ఎన్నిక‌ల వ‌స్తున్నాయ‌ని తెలిసినా రైతుబంధు ఇవ్వ‌కుండా రైతులను మోసం చేశార‌ని పేర్కొన్నారు.. ‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సూటుకేసుల ప్రభుత్వం వస్తుంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అని ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తెలంగాణను పాలించిన తీరు, కేంద్రంలో బీజేపీ పాలన తీరును బేరీజు వేసుకుని ఓటు వేయండి. మోదీని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయి. కేసీఆర్‌ పోటీ చేసిన రెండు చోట్లలో ఓడిపోతారు. బీజేపీ అక్కడ విజయం సాధిస్తుంది. కామారెడ్డిలో కేసీఆర్‌ను గెలిపించడానికి రేవంత్ రెడ్డి పోటీచేస్తున్నారు. తెర వెనుక బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. బీజేపీ కమిట్మెంట్‌ను మ్యానిఫెస్టో రూపంలో తెలంగాణ ప్రజల ముందు పెట్టాం. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేదు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్, కేసీఆర్ మైనార్టీలకు ఇచ్చిన హామీలు ఒక్కటే. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పోటీ పడి హామీలు ఇస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన హామీలు . ముస్లీం ఐటీ టవర్స్ కట్టడం ఏంటి?. సాప్ట్ వేర్ రంగంలో కూడా కేటీఆర్ మతాన్ని జోప్పిస్తున్నారు అంటూ నిల‌దీశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పాలనలో పాతబస్తీ ఎందుకు అభివృద్ధి చేయలేదు?. ఇన్నాళ్లు పాతబస్తీ యువతకు ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించలేదు. పాతబస్తీలో అక్షరాస్యత శాతం ఎందుకు తక్కువగా ఉంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒవైసీ కుటుంబానికి అండగా ఉన్నాయి తప్ప.. సామాన్య ముస్లీం సమాజానికి ఏం చేయలేదు. ఒవైసీ కుటుంబం శాసిస్తే కేసీఆర్ ఏదైనా చేస్తారు. పాతబస్తీ ప్రజలు చదువుకుంటే ఒవైసీ కబంధ హస్తాల నుంచి బయటకు వస్తారని అక్షరాస్యత పెంచకుండా చూస్తున్నారు. పాతబస్తీకి మెట్రో వసతి ఎందుకు కల్పించలేకపోయారు. దారుసలాంను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం దారాదత్తం చేసింది’ అంటూ విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement