Tuesday, May 7, 2024

నరోడా గామ్ కేసులో నిందితులకు క్లీన్ చిట్.. ఆగ్రహం వ్యక్తం చేసిన మావోలు

నరోడా గామ్ కేసులో నిందితులకు క్లీన్ చిట్ ఇవ్వడంపై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నరోడా గామ్ హత్యాకాండలో నిందితులైన మాయ కొద్నానీ, బాబు బజరంగి, జైదీప్ పటేల్ లను స్పెషల్ కోర్టు నిర్దోషులని తీర్పు ఇవ్వడాన్ని ఖండించండి ! న్యాయాన్ని అవహేళన చేయడానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయండి!! అంటూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రి మాయా కొద్నానీ, బజరంగ్ దల్ నేత బాబూ బజరంగి, వీహెచ్ పీ నేత జైదీప్ పటేల్ తో పాటు 67 మంది నిర్దోషులని స్పెషల్ కోర్టు తీర్పు ఇవ్వడాన్ని సిపిఐ (మావోయిస్ట్) పార్టీ ఖండిస్తున్నది. ఈ తీర్పు వెలువడిన వెంటనే ఫాసిస్టు శక్తులు కోర్టులో ‘జై శ్రీరామ్’ అని నినాదాలు చేశాయి. దీని ద్వారా మోడీ పరిపాలనలో రాజ్య సంస్థలు హిందుత్వ దళాలకు పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే విషయం మరోసారి రుజువు అయింది. మాయా కొద్నానీ నేరం జరిగిన చోట ఆ రోజు అక్కడ లేదని ఆమె రాజ్య శాసన సభలో, హాస్పిటల్లో ఉందని అప్పటి హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చిన ఏకైక వాంగ్మూలంపై ఆధారపడి కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. ఇలాంటి సాక్ష్యాన్ని ఆధారంగా తీసుకోలేము. అలాగే నరోడా హత్యాకాండలో వారు ముగ్గురు ఉన్నారనే విషయాన్ని నిరూపించడానికి ఎన్నో ముఖ్యమైన సాక్ష్యాలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. న్యాయ వ్యవస్థ మోడీ అధికారం కింద కాషాయీకరణ చెందుతుందని, ఇది ఫాసిస్ట్ ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరిస్తున్నదని ఈ తీర్పు ద్వారా రుజువైంది. ఇప్పటికే భయభీతాహులై ఉన్న మైనారిటీలు ఈ రోజు నరోడా తీర్పుతో మరింత భీతాహులైనారు.

నరేంద్రమోడీ, అమిత్ షా నాయకత్వంలో 2002లో జరిగిన గుజరాత్ మారణహోమంలో వేలాది మంది ముస్లింలను పట్టపగలే చంపివేయబడడమే కాకుండా, వారి శరీరాలను తునాతునకలు చేయడం, ముస్లిం మహిళలతో పాటు ఆడ పిల్లలను చెరచడం, వారిని సజీవంగా దహనం చేయడం జరిగింది. 21 సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా బాధితులు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. కానీ బిజెపి-ఆరెస్సెస్ నాయకత్వంలోని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు న్యాయాన్ని వారికి అందకుండా చేస్తున్నాయి. గుజరాత్ అల్లర్లలో రాజ్యం, మోడీ ప్రభుత్వం మధ్య ఉన్న సంబంధాన్ని వెలుగులోకి తెచ్చిన పోలీస్ ఆఫీసర్ సంజీవ్ భట్ ను కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం శిక్షిస్తూ వస్తున్నది. రాష్ట్ర అధికారుల ప్రమేయాన్ని గురించి నానావతి కమిషన్ తెల్పిన వాస్తవ విషయం సరిపోతుంది. బిల్కిస్ బానో కేసులో నిందితులను విడుదల చేసిన హైకోర్టు తీర్పు కొనసాగింపు గానే స్పెషల్ కోర్టు తీర్పు ఉంది. ‘ఈ రోజు బిల్కిస్ బానో, రేపు మరొకరు దేశంలోని నా సోదరిమణులకు ఏమి జరుగుతోందోనని భయంగా ఉందని’ బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జోసెఫ్ వ్యాఖ్యానించే పరిస్థితి వచ్చింది. ఎవరైతే అన్యాయానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తుతారో, రాజ్య యత్రాంగాన్ని దుర్వినియోగపరిచే వారిని నిలదీస్తారో, న్యాయం కోసం ఎవరైతే నిలబడుతారో వారిని భీతావహులను చేయడానికి బిజెపి ప్రభుత్వం ఇలాంటి చర్యల ద్వారా సందేశాన్ని ఇవ్వదలుచుకున్నది. జి ఎన్ సాయిబాబా శిక్షను రద్దు చేస్తూ వెంటనే విడుదల చేయాలని బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఇటీవలే సుప్రీంకోర్టు రద్దుచేసింది. మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలను, నాయకులను ఈడీ, సిబిఐ, తప్పుడు మానహనన కేసుల ద్వారా బెదిరిస్తున్నది. మరోవైపు బిజెపి మూక దళాలను రక్షిస్తున్నది.

నరోడా కేసులో నిందితులను అందరినీ విడుదల చేస్తూ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఫాసిస్ట్ తీర్పుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ, బలమైన ఉద్యమాన్ని నిర్మించవలసిందిగా ప్రజా సంఘాలకు, కార్మికులకు, రైతాంగంకు, దళితులకు, ఆదివాసీలకు, ఓబీసీలకు, ప్రజాస్వామిక వాదులకు, మైనారీటీలకు, మహిళలకు, విద్యార్థులకు, మేధావులకు, జర్నలిస్టులకు, న్యాయవాదులకు, జాతులకు సిపిఐ (మావోయిస్ట్) పార్టీ పిలుపునిస్తున్నది. భారతదేశ చరిత్రలో ఒకానొక ప్రమాదకరమైన సమయంలో మనం జీవిస్తున్నాము. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా అందరూ కలసి తిరుగుబాటు చేసి దాన్ని ఆపడంలో విఫలమైతే, రేపు జరగబోయే మరిన్ని విపత్కర పరిణామాలకు మనమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement