Sunday, May 19, 2024

TS | డ్రగ్స్‌, మావోల కట్టడికి చెక్‌ పోస్ట్‌లు.. రక్షణ విషయంలో రాజీ లేదు : డీజీపీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రజల భద్రత, రక్షణ విషయంలో రాజీపడితే సహించేది లేదని రాష్ట్ర పోలీసులకు డిజిపి హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రత పరిరక్షణ నిమిత్తం తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు కమిషనరేట్‌ సిపిలకు, జిల్లా ఎస్‌పిలకు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర సరిహద్దులలో మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా సారించాలని, మావోల కట్టడికి, డ్రగ్స్‌ నియంత్రణకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద నిరంతరం నిఘా సారించాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ తమవంత కృషి చేయాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చారు.

రాష్ట్ర పోలీసుల పనితీరును ఎప్పటికప్పడు తెలుసుకునేందుకు ప్రత్యేక సెల్‌ ఏర్పటు చేశామని, పోలీస్‌ కమిషనర్స్‌, జిల్లా ఎస్‌పిల నివేదికలతో పాటు ప్రత్యేక సెల్‌ సైతం పోలీసుల పనితీరును పర్యవేక్షిస్తుందని వివరించారు. పోలీసు అధికారులు తమ పరిధిలోని సిబ్బందితో సమర్థవంతంగా శాంతి భద్రతలు పరిరక్షిస్తేనే రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతుందని, తద్వారా ప్రజల అభివృద్ధి, పెట్టుబడుల కల్పన సాధ్యమవుతాయని ఆయన సూచించారు.

భద్రతే మన భాద్యత :

రాష్ట్ర ప్రజలకు తగిన రక్షణ, భద్రత కల్పించేందుకు పోలీసులు అహర్నిశలు శ్రమించాలని, ఇందుకోసం ఏర్పాటు చేసిన స్మార్ట్‌, కమ్యూనిటీ పోలీసింగ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. ఫిర్యాదు దారుల పట్ల సున్నితంగా వ్యవహరించడంతో జవాబుదారీ తనంతో వ్యవహరించాలని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే అందరితోనూ ఒకేలా ఉండటం కాదని, నేరస్థుల పట్ల కఠినంగా బాధితులకు భరోసా అందిస్తూ పోలీసులు విధులు నిర్వహించాలని సూచించారు.

విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ఎల్లవేళలా అలర్ట్‌గా ఉండటం, జవాబుదారీతనం, విశ్వసనీయత, భాద్యతాయుత పనితీరు, సాంకేతికత వినియోగం తదితర వాటిని తప్పకా పాటించాలన్నారు. సమస్యలతో, బాధలతో, కన్నీళ్లతో పోలీసు ఠాణాలకు వచ్చిన వారికి పోలీసులు భరోసా కల్పించి ఆనంద బాష్పాలతో తిరిగి వెళ్లేలా ప్రతీ పోలీసు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

- Advertisement -

ముందే అప్రమత్తం కావాలి :

రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ సంతృప్తికర స్థాయిలో ఉన్నాయని, తీవ్రమైన శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకముందే ఆయా ప్రాంతాల పోలీసులు అప్రమత్తం కావాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చూడటంలో రాష్ట్ర పోలీసులు అవసరమైన రీతిలో క్రియాశీలక చొరవ ప్రదర్శించాలని తెలిపారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతలు కాపాడే విషయంలో రాష్ట్ర పోలీస్‌ విభాగం కమ్యూనిటీ పోలీసింగ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు.

కఠిన శిక్షలతోనే నేరాల కట్టడి :

కీలక కేసులలో నిందితులకు సంబంధించిన ఆధారాలు సేకరించాలని, నేరస్థులకు శిక్షలు పడితేనే నేరాల శాతం తగ్గుముఖం పడుతుందని రాష్ట్ర పోలీసులకు డిజిపి సూచించారు. హైదరాబాద్‌ తో పాటుగా రాష్ట్రంలోని అనేక ప్రధాన నగరాలు, పట్టణాలలో లక్షలాది సి.సి.టి.వి. కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎంతోమంది నేరస్తులను అరెస్ట్‌ చేయడానికి వీలైందని గుర్తు చేశారు.

నేరానికి పాల్పడితే కటకటాలు తప్పవనే సందేశం నేరస్తులకు వెళ్ళేలా చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుందన్నారు. టి.ఎస్‌. కాప్‌, హాక్‌ ఐ, సైబర్‌ క్రైండిటెక్షన్ టూల్స్‌ వంటి అత్యాధునిక సాంకేతిక అప్లికేషన్లను వినియోగించుకుంటూ, బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో సంచలనం రేపిన అనేక కేసులను అవి జరిగిన 24 గంటలలోనే చేదించడం జరిగింది.

నిందితులను అరెస్ట్‌ చేసి, త్వరిత గతిన విచారణ పూర్తి చేసి, నేరాలకు పాల్పడిన వాళ్లకు వెంటనే శిక్షలు పడేలా ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. మహిళలు, పిల్లలపై జరిగిన నేరాలలో విచారణ అనంతరం కోర్టులు నేరస్తులకు యావజ్జీవ శిక్ష లేదా మరణ శిక్షలు విధించాయన్నారు. తరచూ నేరాలకు పాల్పడే నేరస్థులపై పి.డి. చట్టం కింద కేసులు బుక్‌ చేసి, వాళ్ళు తిరిగి నేరాలకు పాల్పడకుండా కట్టడి చేయాలని తెలిపారు.

సమస్యాత్మక ప్రాంతాలలో :

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాలుగా పేరొందిన అనేక ప్రాంతాలో మత పరమైన శాంతి భద్రతల పరిస్థితి కూడా పూర్తిగా అదుపులో ఉన్నాయని, ఎక్కడా అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డిజిపి రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చారు. సున్నితమైన ప్రాంతాలలో ఏమైనా ఉల్లంఘనలు జరిగితే నిర్దిష్ట చట్టాల పరిధిలో కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా ప్రజా భద్రత (ప్రమాణాలు) అమలు చట్టం, 2013 రూపొందించిందని, నేర నియంత్రణలో పౌరులు, కమ్యూనిటీకి భాగస్వామ్యం కల్పించడానికి ఇది అవకాశం కల్పిస్తుందని వివరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం వహించే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే ఆరోపణలు వచ్చిన పోలీసులపై అనతికాలంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని పోలీసు కమిషనరేట్‌ల సిపిలకు, ఎస్‌పిలకు ఆదేశాలిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement