Monday, April 29, 2024

తెలంగాణ నీటిప్రాజెక్టుల రుణాలపై కేంద్రం కొర్రీలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సాగునీటి ప్రాజెక్టులకు రుణాలు సేకరించకుండా కొత్త కండీషన్లు పెట్టిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీలపై తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది. నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణ రుణాలపై కొత్తగా షరతులు విధించడంపై కేంద్రానికి నిరసన తెలిపింది. ఈ మేరకు ఆయా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు లేఖ రాసింది. కండిషన్లు పెట్టి నిధులు నిలిపేస్తే న్యాయపరమైన చర్యలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించింది. నీటిపారుదల ప్రాజెక్టుల రుణాలకు ఏకపక్ష షరతులు విధించడం సరికాదని కేంద్ర ప్రభుత్వానికి హితవు చెప్పింది. ఒప్పందాలకు విరుద్ధంగా మధ్యంతర షరతులు విదించడం తగదని ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీలకు స్పష్టం చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌తో కలిపి త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలని ఆకస్మాత్తుగా షరతు విధించడం రాజకీయ ప్రేరేపిత చర్యగా స్పష్టం చేసింది. కొత్త కొర్రీలతో రుణాలు నిలిపివేస్తే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. కాలేశ్వరం, సీతారామ, కంతనపల్లి తదితర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రూరల్‌ ఎలక్ట్రిఫికల్‌ కార్పోరేషన్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ ల నుంచి ఇందుకు రుణాలు సేకరిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ కార్పోరేషన్‌కు ఈ రెండు సంస్థలు గతంలో కుదిరిన ఒప్పందం మేరకు నిధులను గతంలోనే మంజూరు చేశాయి.

కాళేవ్వరం కార్పోరేషన్‌కు ఆర్‌ఈసీ రూ.30, 536 కోట్లను మంజూరు చేయటంతోపాటు ఇప్పటి వరకు 12, 742 కోట్లను విడుదల చేసింది. అటు పీఎఫ్‌సీ 37, 737 కోట్లు మంజూరు చేసి 33079 కోట్లు సమకూర్చింది. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సదుపాయాల సంస్థకు ఈఆర్‌సీ 13, 516 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఇందులో 12239 కోట్లు విడుదల చేసింది. పీఎఫ్‌సీ 3416 కోట్లు మంజూరు చేసి 410 కోట్లు విడుద లచేసింది. అయితే రాష్ట్రాల రుణాలకు కేంద్రం ఇటీవల అభ్యంతరం చెప్పడంతో రిజర్వ్‌ బ్యాంకుతో కలిపి మరోసారి త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవాలని ఈ సంస్థలు కొత్తగా షరతును విధిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల తాజా షరతును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement