Monday, April 29, 2024

North Telangana: కుల రాజకీయం కలిసొచ్చేనా?!

ఉత్తర తెలంగాణ, ప్రభన్యూస్‌ బ్యూరో: కుల రాజకీయం నానాటికీ పెరిగిపోతోంది. ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తే చాలు కుల రాజకీయం తెరపైకి వస్తుంది. కుల సంఘాలను అడ్డుపెట్టుకుని లీడర్లుగా చెలామణి అవడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు ఆజ్యం పోస్తున్నాయి. కుల జనాభా ప్రాతిపదికన పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి.

స్థానిక సంస్థల, కార్పొరేషన్‌, ఇతర నామినేటెడ్‌ పదవుల్లో కూడా కులాల బలాబలాల్ని పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు చేస్తున్నారు. కులం, మతం అనేవి ఉండకూడదని ప్రగల్భాలు పలికే నేతలు ఆచరణలో మాత్రం కులాల వారీగా విభజించి ఓట్ల రాజకీయం చేయడం గమనార్హం. ఇటీవల కుల సంఘాలే ప్రధానంగా రాజకీయ సమీకరణాలు చేస్తున్నారు. పార్టీల పదవుల్లో కూడా కుల ప్రాతిపదికన కేటాయింపులు జరుగుతున్నాయి అంటే కుల రాజకీయం ఏ మేర వేళ్ళూనుకుపోతుందో స్పష్టం అవుతోంది. ఇక ఎన్నికల వేల ఓట్ల కోసం అభ్యర్థులు పడనిపాట్లు లేవు. ఎలాగైనా ఓట్లు రాబట్టుకోవడం కోసం వెర్రితలల వేశాలు వేస్తుంటారు. అనేక ఏళ్లుగా కుల సంఘాల మద్దతు కోసం ఫీట్లు చేస్తుంటారు. ఈ సంప్రదాయం నానాటికీ ##హచ్చుమీరుతోంది. కుల సంఘాలే ప్రధాన బలంగా అభ్యర్థులు, పార్టీలు భావిస్తున్నాయి. ఇందుకోసం అనేక రకాల వ్యూహాలు పన్నుతున్నాయి. కుల సంఘాలకు గాలం వేసేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. మెజారిటీ సభ్యులు ఉండే కులసంఘాలకు ఇక డిమాండ్‌ వేరు. కుల సంఘాల పెద్దరికం గ్రామాల్లో ఓ రేంజ్‌లో ఉంటుంది. కుల సంఘాల తీర్మానాలు, కట్టుబాట్లు సభ్యులు ఆచరించాలి అంతే. గ్రామాల్లో ఎలాగైతే కుల సంఘాల పెత్తనం ఉందో అలాగే పట్టణాల్లో కూడా కుల సంఘాల కట్టుబాట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో కుల సంఘాల మద్దతే కీలకం అన్నట్లుగా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా కుల సంఘాల ట్రెండ్‌ రాజకీయం నడుస్తోంది. అన్ని పార్టీలదీ ఒకటే తొవ్వ. ఇంత జరుగుతున్నా… కుల సంఘాల మద్దతు అభ్యర్థులను గెలిపిస్తుందనే గ్యారంటీ ఉందా? ఎంత మేర కుల రాజకీయం కలిసొస్తుంది? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
కుల సంఘాలకు తాయిలాల ఎర!
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కోట్ల రూపాయలు గడ్డిపోచల్లా అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ విధించిన ఖర్చు ఒక్కరోజులో ఖర్చయిపోతుంది. కేవలం నామినేషన్‌ రోజున కనీసం రూ. కోటి పైనే ఖర్చు చేశారంటే అతిశయోక్తి కాదు. డబ్బులు ప్రధాన ఆయుధంగా పార్టీలు టిక్కెట్లు కేటాయించాయి. సిద్ధాంతాలు, మంచి అభ్యర్థులు, మేధావులు, సమాజ సేవకులు అనే వ్యక్తులు ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ముద్ర వేశారు. కుల బలం, ధన బలం ప్రధాన అర్హతలుగా టికెట్ల కేటాయింపులు జరగడం బ#హరంగమే. ఇక అభ్యర్థులు ఖర్చు ప్రధానంగా కుల సంఘాలపై పెడుతున్నారు. సంఘాల వారీగా ఓటర్లను పరిగణనలోకి తీసుకుని డబ్బులు, మద్యం ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే మద్యం దావత్‌లు జోరుగా సాగుతున్నాయి. ఒప్పందం ప్రకారం సంఘాలకు డబ్బుల చెల్లింపులు జరుగుతున్నాయి. భారీగా కుల సంఘాల పెద్ద మనుషులకు తాయిలాలు అందుతున్నాయి. సంఘాలకు ఎత్తున డబ్బులు మాట్లాడుకుంటున్నారు. ఇక నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో ఓ కీలక నియోజకవర్గంలో ఇప్పటికే స్వంత డబ్బులతో ఓ నేత భవనాలు నిర్మించినట్లు ప్రచారం జరుగుతోంది. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో కుల సంఘాలకు ఏకగ్రీవ తీర్మానాల కోసం వంద మంది సభ్యులు ఉంటే రూ.లక్ష చొప్పున ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే కుల సంఘాల భవనాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు జరిగింది. దీన్ని పూడ్చడానికి ప్రతిపక్ష పార్టీల నేతలు భారీగా నగదు, మద్యం ఇతర నజరానాలు ఇచ్చి మద్దతు కూడ గట్టుకునెందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏకగ్రీవ తీర్మానాలపై సంఘాల్లో రగడ
గ్రామాల్లో కుల సంఘాల ఆదాయం పెంచుకునేందుకు సంఘం ప్రతినిధులు ఎన్నికల వేళ అడ్డదారులు తొక్కుతారు. ప్రధానమైన ఆయుధాన్ని అమ్మకానికి పెడతారు. పౌరుని #హక్కు అయిన ఓటును అంగట్లో పెడతారు. ఇందుకు అభ్యర్థులు కొనడానికి లక్షలు చెల్లించడానికి సైతం వెనుకాడరు. ఓటును అమ్మే దుష్టసంస్కృతిని ఇంకా గ్రామాల్లో కుల సంఘాలు కొనసాగిస్తున్నాయి. వెల కట్టలేని ఓటును ఒక సమర్థుడైన నేతను ఎన్నుకోవడానికి వాడాల్సి ఉండగా, అంగట్లో సరుకుగా మార్చుతున్నాయి. ఇందుకోసం కులసంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. ర#హస్య ఓటును బ#హరంగం చేస్తున్నాయి. ఇది వరకు గతంలో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్‌, అదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు అభివృద్ధి పేరిట ఎన్నికల్లో వేలం తీసుకొచ్చారు. వేలం పాటల్లో అధిక డబ్బులు పాడిన అభ్యర్థిని ఏకగ్రీవంగా గ్రామాభివృద్ధి కమిటీలు ఎన్నుకునేవి. ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ దుష్టసంస్కృతి కొనసాగుతోంది. ఇదిలాఉంటే కుల సంఘాల తీర్మానాలు ఓ పార్టీకి మద్దతుగా చేస్తుండడం రగడ సృష్టిస్తోంది. నిజమాబాద్‌ జిల్లాలో ఓ గ్రామంలో మెజారిటీ కుల సంఘం ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో ఆ సంఘం ప్రతినిధులను బ#హరంగంగా నిలదీశారు. ఓటును ఎలా అమ్ముకుంటారని ప్రశ్నించారు. రగడ కాస్త ముదరడంతో ఇక గత్యంతరం లేక ఏకగ్రీవ తీర్మానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం డబ్బుల కోసం కుల సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయనే అపవాదు ఉంది.
కుల సంఘాల మద్దతు కలిసొస్తుందా?
గ్రామాల్లో కుల సంఘాలు చేస్తున్న తీర్మానాలు, మద్దతు అభ్యర్థులకు కలిసొస్తుందా? అంటే లేదనే చెప్పాలి. బలం కోసం పార్టీల అభ్యర్థులు కుల సంఘాల వెంట పడుతున్నారు. నిజానికి కుల సంఘాలు తీసుకునే నిర్ణయాలను సభ్యులు ఏ మాత్రం పాటించడం లేదు. సరికదా… సంఘ ప్రతినిధులు కూడా సభ్యులపై ఒత్తిడి తేవడం లేదు. కేవలం అభ్యర్థులను ఖుషీ చేసేందుకు ఇచ్చే వాటిని తీసుకుంటున్నారనే వాదనలు ఉన్నాయి. తీర్మానాలు కూడా కేవలం ఆదాయం కోసం చేస్తున్నారని బ#హరంగంగా మాట్లాడుకుంటున్నారు. ఈ లెక్కన కుల సంఘాల మద్దతు అభ్యర్థులకు కలిసొస్తుందా? అంటే అంతగా ఫలితం ఉండదనేది స్పష్టంగా క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటును ప్రలోభాలకు గురికాకుండా చూసే బాధ్యతను కుల సంఘాలు భుజాన వేసుకుంటే గొప్ప వ్యక్తులు చట్టసభల్లో అడుగుపెడతారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement