Thursday, May 16, 2024

2024 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి – లోక్ సభలో బీఆర్ఎస్

న్యూ ఢిల్లీ – మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చలో బీఆర్ఎస్ లోక్ సభాపక్షనేత నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలన్నారు.2014 జూన్ లో తెలంగాణ మొదటి సమావేశాల్లోనే మహిళా బిల్లుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని, బిల్లు కేంద్రానికి పంపి 10 ఏళ్ళు అయిందని తెలిపారు. 128వ రాజ్యాంగ సవరణను, డీ లిమిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రల్లో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జట్పీటీసీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుందన్నారు.

అలాగే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలతో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ కు దక్కిందని కొనియాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన మిగతా ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని నామ నాగేశ్వరరావు కోరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement