Sunday, April 28, 2024

BRS – అభ్యర్ధుల‌కు బి ఫామ్స్ అంద‌జేసిన కెసిఆర్ … ప్రచార రూట్ మ్యాప్ ఖరారు …

ఆల్ ద బెస్ట్ తో పాటు అభ్య‌ర్ధుల‌ను
ఆశీర్వ‌దించిన గులాబీ బాస్
ఇక ఎన్నిక‌ల ప్ర‌చారం షురూ
ఉద‌యం పొలం బాట‌…సాయంత్రం కెసిఆర్ రోడ్ షోలు
ఇక‌పై ఉద్య‌మ కాలం నాటి కెసిఆర్ ని చూస్తార‌న్న గులాబీ బాస్
ఈ స‌మావేశానికి హాజ‌రైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధులు, పార్టీ నేత‌లు

హైద‌రాబాద్ : బిఆర్ఎస్ త‌రుపున లోక్ స‌భ కు పోటీ చేస్తున్న 17 మంది అభ్య‌ర్ధుల‌కు ఆ పార్టీ అధినేత కెసిఆర్ బి ఫామ్స్ అంద‌జేశారు.. అలాగే ఎన్నిక‌ల ప్ర‌చారం, ఇత‌ర కార్య‌క‌లాపాల ఖ‌ర్చుల కోసం ఒక్కో అభ్య‌ర్ధికి రూ.95 లక్ష‌ల‌ చెక్ ల‌ను కూడా ఇచ్చారు.. తెలంగాణ భ‌వ‌న్‌లో కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న నేడు జ‌రిగిన బీఆర్ఎస్ విస్తృత‌స్థాయి స‌మావేశంలో ఎంపీ అభ్య‌ర్థుల‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీచైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కెసిఆర్ పోటీ చేస్తున్న అభ్య‌ర్ధుల‌కు ఆల్ ద బెస్ట్ చెబుతూ వారిని ఆశీర్వ‌దించారు.. ఈ స‌మావేశం రెండున్న‌ర గంట‌ల పాటు సాగింది.. లోక్‌స‌భ ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహంపై గులాబీ శ్రేణుల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో ఉద్య‌మ కాలం నాటి కేసీఆర్‌ను మ‌ళ్లీ చూస్తార‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో రాజ‌కీయం గంద‌ర‌గోళం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు. ఏ రాజ‌కీయ గంద‌ర‌గోళం జ‌రిగినా బీఆర్ఎస్‌కే మేలు జ‌రుగుతుంది. ఉద్య‌మ‌కాలం నాటి కేసీఆర్‌ను మ‌ళ్లీ చూస్తారు. బ‌స్సు యాత్ర రూట్ మ్యాప్ ఇవాళ ఖ‌రార‌వుతుంద‌న్నారు. . కాంగ్రెస్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ప్రారంభ‌మైందని,.. రానున్న రోజులు మ‌న‌వే. పార్ల‌మెంట్‌లో మ‌న గ‌ళం వినిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. . రైతు స‌మ‌స్య‌లు అజెండాగా ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్లాల‌ని కోరారు. కొంద‌రు నేత‌లు పార్టీని వీడి వెళ్లినంత మాత్రానా బీఆర్ఎస్‌కు న‌ష్టం ఏమీ లేదు అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఉద‌యం పొలం బాట‌…సాయంత్రం రోడ్ షో

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి అధినేత కేసీఆర్ సరికొత్త పంథా ఎంచుకున్న‌ట్లు స‌మ‌చారం . ఎండిన పంట పొలాల‌ను ప‌రిశీలించ‌డంతో పాటు రోడ్డు షోల్లో పాల్గొనాల‌ని నిర్ణ‌యించారు కెసిఆర్ . ఉదయం 11 గంట‌ల‌ వరకు పొలం బాట.. సాయంత్రం నుండి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో 2-3 చోట్ల రోడ్డు షోలు, కార్న‌ర్ మీటింగ్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం. సిద్దిపేట‌, వ‌రంగ‌ల్‌లో ల‌క్ష మందితో భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించాల‌ని ప్లాన్ రూపొందించారు.

కాగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్రధానంగా తాను చేపట్టే బస్సు యాత్ర రూట్‌మ్యాప్‌పై పార్టీ స‌భ్యుల‌తో గులాబీ బాస్ చ‌ర్చించ‌నున్నారు. అంత‌కు ముందు భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో ఉన్న తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి కేసీఆర్ పూల‌మాల వేశారు. అనంత‌రం కేసీఆర్ గులాబీ శ్రేణుల‌కు అభివాదం చేస్తూ భ‌వ‌న్‌లోకి వెళ్లారు.ఇక మాజీ మంత్రులు కెటిఆర్,హారీష్ రావు,శ్రీనివాస్ గౌడ్ , వేముల ప్ర‌శాంత‌రెడ్డి త‌దిత‌రులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement