Monday, April 29, 2024

బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురు.. సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరణ.. విచారణ వాయిదా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రొసీడింగ్స్‌ ఉత్తర్వులు, వీడియో రికార్డులు సమర్పించేందుకు ఆదేశాలు ఇవ్వాలన్న పిటీషనర్ల అభ్యర్థనలను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అయితే పూర్తి స్థాయి విచారణకు శాసనసభ కార్యదర్శికి మరోసారి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. బాజపా ఎమ్మెల్యేల సప్పెన్షన్‌పై విచారణ మరో నాలుగు వారాలకు వాయిదా పడింది.
శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి తమను సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ బాజపా ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసి అసెంబ్లీ సమావేశాలకు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే. సస్పెన్షన్‌ తీర్మానంతో పాటు సమావేశాల వీడియో రికార్డింగ్‌లను తెప్పించాలని ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలివ్వాలని బాజపా ఎమ్మెల్యేలు కోరారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు (ఈనెల 7)న ఆర్థిక మంత్రి హరీష్‌రావు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బాజపా సభ్యులు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌ మంత్రి ప్రసంగానికి అడ్డు తగులుతున్నారంటూ వారిని సభ నుంచి సస్పెండ్‌ చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని స్పీకర్‌ ఆమోదించి వారిపై వేటు వేశారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు బాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తూ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement