Tuesday, April 30, 2024

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై భట్టి ధ్వజం – కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయంటూ ఫైర్

ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి దేశానికి స్వాతంత్రంతో పాటు నవభారత నిర్మాణం చేసి, అనేక పరిశ్రమలను నెలకొల్పి కార్మికుల హక్కులను అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు కార్మికుల పక్షపాతిగా ఉండగా నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం పీపుల్స్ మార్చ్ 45వ రోజు కార్యక్రమంలో భాగంగా యాదాద్రి జిల్లాలోని ఆలేరు పట్టణ కేంద్రంలోని ఏర్పటు చేసిన కార్నర్ సమావేశంలో మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో భారాస ప్రభుత్వం కార్మికుల హక్కులను విస్మరించిందని చెబుతూ సింగరేణి లాంటి ప్రభుత్వ సంస్థను ప్రైవేటీకరణ చేస్తూ కార్మికులను ఉద్యోగాల నుంచి తీసివేసిందన్నారు. లక్ష 5 వేల ఉద్యోగాలు ఉన్న సింగరేణిలో నేడు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 42 వేలకు కుదించి 60 వేల మంది కార్మికుల జీవితాలను రోడ్డుపాలు చేసిందన్నారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలు లేకుండా చేసి కార్మిక హక్కులను కాలరాసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం లోనే కార్మిక హక్కులు, కార్మిక చట్టాలు అమలైనట్లు పేర్కొన్నారు

. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన భాజపా ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ ఉద్యోగులను రోడ్డుపాలు చేస్తున్నదని విమర్శించారు. మే డే స్ఫూర్తితో కార్మికులు ఉద్యోగులు కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పెట్టుబడి దారుల చేతుల్లో భారత దేశం బందీగా అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు సంపదను ఆ నలుగురు దోచుకుంటున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలి దేశాన్ని పెట్టుబడి దారుల చేతిలోకి అప్పగించారన్నారు. రాష్ట్రంలో అడుగడుగునా రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెబుతూ సమస్యల పరిష్కారం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని, పీపుల్స్ మార్చ్ కు వస్తున్న భారీ స్పందన రేపటి గెలుపుకు సూచిక కానున్నదని చెప్పారు. రాహుల్ గాంధీ నిర్వహించిన జోడో యాత్ర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రెఫరెండం కాబోతుందన్నారు. తెలంగాణ లక్ష్యాలు నెరవేర నందుని తాను పాదయాత్ర చేస్తున్నానని రానున్న ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలన్నీటిని పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement