Friday, September 22, 2023

సోమేశ్ కుమార్ ను ఛీఫ్ అడ్వైజర్ గా తొలగించాలి – భ‌ట్టి డిమాండ్

మామిడిప‌ల్లి – ఉద్యోగ విరమణ చేసిన సోమేశ్ కుమార్ కి మళ్ళీ సీఎం చీఫ్ అడ్వైజర్ పదవి ఏంటి? ఇక్కడ ఆయనకున్న ఇంట్రెస్ట్ ఏంటి.? ధరణి సృష్టి కర్త ..స్కామ్ స్టార్ సోమేశ్ కుమార్ ను తక్షణమే చీఫ్ అడ్వైజర్ పదవి నుంచి తొలగించాలని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మామిడిపల్లి ఎక్స్ రోడ్ పాదయాత్ర శిబిరం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిసిసి అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి తో కలిసి ఆయన మాట్లాడుతూ సీఎం చీఫ్ అడ్వైజర్ గా సోమేశ్ కుమార్ ను నియామకం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను చూసి ఆశ్చర్యం వేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తికి మళ్ళీ పదవి ఏంటి? అంటూ షాక్‌ కు గురయ్యానని అన్నారు. ఐఏఎస్‌లు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే గౌరవంగా ఆ రాష్ట్రానికి వెళ్లి పనిచేసుకోవాలన్నారు. కానీ, సోమేష్‌ కుమార్‌ లాంటి వ్యక్తి ఏపీకి వెళ్లకుండా విఆర్ఎస్ తీసుకొని సీఎం చీఫ్ అడ్వయిజర్‌గా పదవి పొందడంలో ఇంట్రెస్ట్ ఏమున్నదని ప్రశ్నించారు.

- Advertisement -
   

కొలువుల కోసం కొట్లాడీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ అయిన ఉన్నతాధికారులను తిరిగి ఎందుకు నియమిస్తున్నారని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. రిటైర్డ్ అధికారులపై చాలా అపోహలు ఉన్నాయన్నారు. ధరణి తీసుకు వచ్చిన తర్వాత పార్ట్ బి లో ఉన్న భూములను దిగమింగడానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, భూ బకాసురులకు సోమేశ్ కుమార్ లాంటి అధికారులు ఉపయోగపడుతున్నారని, అందుకనే రిటైర్డ్ అధికారులను అడ్వైజర్లుగా నియామకం చేసుకుంటున్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. పేదలకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన భూములను ధరణి పేరుతో లాక్కున్నారని వివరించారు. జైపూర్ మండలం బాండేడ్ లేబర్ కాలనీలోని రైతులకు వెట్టిచాకిరి విముక్తి నిమిత్తం ఇచ్చిన భూములను ధరణి వచ్చిన తర్వాత వెనక్కి గుంజుకున్నారని వెల్లడించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. ఒక్క ఇ‍బ్రహీంపట్నం నియోజకవర్గంలోనే 5లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు లాక్కున్నారని, హైదరాబాద్ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో 25లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను లాక్కున్నారని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చేసే భూముల దోపిడీలో సూత్రధారి, పాత్రధారిగా ఉన్న సోమేశ్ కుమార్ లాంటి వ్యక్తిని మళ్ళీ సలహాదారుగా నియమించుకోవడం మిగిలి ఉన్న భూములను దోపిడీ చేయడానికేనా అని నిలదీశారు

. బ్యూరోక్రాట్స్ ప్రజలకు ఉపయోగపడే స్కీములు తీసుకురావడానికి సలహాలు చెప్పాలి కానీ, పాలకులు స్కాములు చేసే పథకాలకు సలహాలు చెప్తే ఎలా అని అన్నారు. ధరణి సృష్టికర్త స్కాం స్టార్ సోమేష్ కుమార్ ప్రైవేట్ వ్యక్తులకు క్లియర్ చేసిన ప్రభుత్వ భూముల పై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు లేఖ రాస్తామని వెల్లడించారు. అవసరం అయితే రాష్ట్రపతిని కూడా కలుస్తామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కడ ఉన్నా ఆ సమాచారం ప్రజలకు చేరవేయాలని విద్యార్థి, నిరుద్యోగ లోకానికి పిలుపునిచ్చారు. రిటైర్డ్ అయిన వాళ్ళు గబ్బిలాల లెక్క పట్టుకుని వేలాడటం మంచిది కాదన్నారు. ఉద్యోగాలు లేని వాళ్ళను బతకనీయండి అని రిటైర్డ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రజల కోసం కాకుండా బహుళ జాతి కంపెనీల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. హైద్రాబాద్ అభివృద్ధి చేయకపోగా ఓఆర్‌ఆర్‌ అమ్ముకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. సోమేశ్ కుమార్, ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ లు ఈ ప్రభుత్వ పెద్దలకు ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకునే స్కిం ఇచ్చారని ఆరోపణలు గుప్పించారు. ఓఆర్‌ఆర్‌ని ముపై ఏండ్లు అమ్మకానికి పెడితే ఎలా ? అందిన కాడికి అమ్ముకోవడమేనా అంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అందిన కాడికి దోచుకోవడమే పనిగా బిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సెక్యూరిటీ లేకుండా ఓయూ కేయూ కి వెళ్లి వచ్చే దమ్ము ఉందా? మంత్రి కేటీఆర్ తలసానికి భట్టి సవాల్

విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ ఉచ్చులోకి దింపుతున్నారని వ్యాఖ్యలు చేసిన మంత్రులు కేటీఆర్, తలసానిలు ఓసారి ఉస్మానియా, కేయూ యూనివర్సిటీ కి సెక్యూరిటీ లేకుండా వెళ్లి వస్తే అప్పుడు నిరుద్యోగుల బాధ ఏంటో తెలుస్తుంది అని అన్నారు. ప్రియాంక గాంధీ టూరిస్ట్ అంటూ మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన కామెంట్స్ పై ఫైర్ అయ్యారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గురించి మాట్లాడే వ్యక్తా? ఆయనకు ఆ అర్హత, జ్ఞానము లేదంటూ మండిపడ్డారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు పంపిణీ చేసిన భూముల వివరాలు, ప్రభుత్వం వెనక్కి తీసుకున్న భూముల వివరాల విలువను శ్వేత పత్రం ద్వారా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement