Monday, April 29, 2024

TS: ఎన్నికలప్పుడే వచ్చే బీజేపీ, కాంగ్రెస్ నాయకుల పట్ల జాగ్రత్త.. మంత్రి గంగుల

కరీంనగర్ : ఎన్నికలప్పుడే కనిపించే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆ తర్వాత కనిపించకుండా పోతారని.. వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగరంలో 133 కోట్ల సిఎం హామి నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నగర మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ బుధవారం శంకుస్థాపన చేశారు. మొదట 20వ డివిజన్ లో పర్యటించిన మంత్రి గంగుల ఇక్కడ 4 కోట్ల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్డు, డ్రైనేజీ, పైప్ లైన్ పనులకు స్థానిక కార్పోరేటర్ తుల రాజేశ్వరీ, బాలయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుతో పాటు, బస్తీ దవఖానను ప్రారంభించారు. ఆ తర్వాత ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అక్కడి నుండి 56వ డివిజన్ చేరుకున్న మంత్రి గంగుల స్థానిక కార్పోరేటర్ వంగపల్లి రాజేందర్ రావుతో కలిసి సుమార్ 2 కోట్ల 60 లక్షలతో చేపట్టనున్న సిసి రోడ్డు, డ్రైనేజీ, పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు.

త్వరితగతిన పనులు చేపట్టి, యుద్ద ప్రతిపాదికన పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు, కాంట్రాక్టర్ కు సూచించారు. అక్కడి నుండి 34వ డివిజన్ గోదాంగడ్డకు చేరుకున్న మంత్రి గంగుల ఇక్కడ 34, 35 డివిజన్లలో చేపట్టనున్న సిసి రోడ్డు, డ్రైనేజీ, పైప్ లైన్ పనులకు స్థానిక కార్పోరేటర్లు షకీర అంజుమ్- బర్కత్ ఆలీ, చాడగొండ బుచ్చిరెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఎక్కడెక్కడ సిసి రోడ్లు నిర్మిస్తున్నారు, డ్రైనేజీల నిర్మాణం ఎక్కడ చేపడుతున్నారంటూ అరా తీసి… త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆరేపల్లి గ్రామం మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు మంత్రి గంగుల. ఆరేపల్లి అభివృద్ధి కోసం ఎన్ని కోట్లైనా వెచ్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్న మంత్రి గంగుల… అభివృద్ధి చెందుతున్న ఆరెపల్లిని చూస్తే గర్వంగా ఉందన్నారు. కరీంనగర్ గడ్డపై ఒకసారి గెలిచిన వారు వరుసగా రెండోసారి గెలిచిన చరిత్ర లేదని… తనకు హ్యాట్రిక్ విజయాలు కట్టబెట్టిన మీకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. అరెపల్లి అభివృద్ధి కోసం ఈరోజు రూ.4 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామన్న మంత్రి గంగుల… ఆరెపల్లిలో మట్టి రోడ్డు అనేది కనిపించకుండా… సిసి రోడ్లను… దుర్గంధాన్ని వెదజల్లకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మిస్తామన్నారు. సమైక్య పాలనలో కరీంనగర్ అభివృద్ది కోసం నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వద్దకు వెళ్లి నిధులు కావాలని… దరఖాస్తు ఇచ్చి దండం పెడితే… వెకిలిగా నవ్వారే తప్ప రూపాయి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. మన సాగు నీరు… బొగ్గు… కరెంట్… హైదరాబాద్ సంపదను దోచుకుని ఆంధ్రాకు తరలించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో సాగునీరు లేక… పంటలు సరిగా పండక రైతులు ఆత్మహత్యలు, రోడ్లు వేయకపోవడంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారిన పరిస్థితులుండేవన్నారు. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన తెలంగాణను అభివృద్ది చేసుకునేందుకే… పోరాడి తెలంగాణను సాధించుకున్నామని, స్వయం పాలనలో కరీంనగర్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వేలకోట్ల నిధులను విడుదల చేశారన్నారు. ఇప్పుడు సాగునీరుకు ఇబ్బందులు లేకుండా పోయి… రెప్పపాటు కూడా కరెంటు పోనీ పరిస్థితులు వచ్చాయన్నాారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement