Thursday, May 9, 2024

ప్ర‌భుత్వ ఆస్ప‌త్ర‌ల్లో మెరుగైన సేవ‌లు.. అన‌వ‌స‌రంగా సిజేరియ‌న్లు చేయొద్దన్న మంత్రి హ‌రీశ్‌

ప్రభుత్వ ఆస్ప‌త్రుల‌లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మంత్రి టి. హరీష్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్ద‌ప‌ల్లి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్యారొగ్య శాఖ పనితీరుపై మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌, జిల్లా కలెక్టర్ సంగీత‌తో క‌లిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించడానికి తీసుకున్న చర్యల ఫలితంగా ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌లో 98 నుంచి 90% , ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో 77 నుంచి 67% సిజేరియన్లు తగ్గాయన్నారు. ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో 56 నుంచి 63% ప్రసవాలు పెరిగ్గాయని ఈ సంద‌ర్భంగా కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లిలో 100 పడకలు, మంథనిలొ 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు చేసుకున్నామని, త్వరలో ప్రభుత్వ వైద్య కళాశాల సైతం అందుబాటులొకి వస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు.

జులై , 2022లో ప్రభుత్వ ఆసుపత్రులలో 80% ప్రసవాలు జరిగే విధంగా అధికారులు పనిచేయాలని, క్షేత్రస్థాయిలో గర్భిణుల కేసులను ఆశ, ఎఎన్ఎం లను సమన్వయం చేసుకుని ఫాలో అప్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో అత్యధికంగా సీజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని ప్రపంచ ఆరొగ్య సంస్థ సైతం హెచ్చరించిందని, దీని త‌గ్గించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో సీజేరియన్ ఆపరేషన్లు తగ్గినప్పటికి మరింత తగ్గాల్సిన అవసరం ఉందని మంత్రి హ‌రీశ్‌ తెలిపారు.

ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో సాధారణ ప్రసవం చేసే వైద్యులు, ఎఎన్ఎం, ఆశ సిబ్బందికి రూ.3వేల ప్రోత్సాహకం సైతం అందించడం జరుగుతుందని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులపై పర్యవేక్షణ ఉండాలని, ప్రతి సీజేరియన్ ఆపరేషన్ ఆడిట్ కట్టుదిట్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులలో అనవసరపు సీజేరియన్ ఆపరేషన్లు చేసే వారి పేర్లు రాష్ట్ర వైద్య కౌన్సిల్ కు రిఫర్ చేయాలని, వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ కు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 700 ఆశ వ‌ర్క‌ర్ల‌ పరిధిలో అత్యధికంగా ప్రైవేటు ఆసుపత్రులలో ప్రసవాలు జరుగుతున్నట్లు గుర్తించామని, పెద్దపల్లి జిల్లాలో సైతం ఆశ వ‌ర్క‌ర్ల‌ పనితీరుపై ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహించాలని డిఎంహెచ్ఒకు మంత్రి సూచించారు.

ప్రభుత్వం ఆసుపత్రులలో నూతనంగా పారిశుద్ద్యం, రోగుల భోజన వసతులు మెరుగుపర్చెందుకు నూతన టెండర్లు జిల్లా స్థాయిలో అందించే అవకాశం కల్పించిందని మంత్రి తెలిపారు. ఆసుపత్రిలో పారిశుద్ద్య కార్మికులకు ప్రభుత్వం వేతనాలు రూ.12 వేలకు పెంచిందని, క్షేత్రస్థాయిలో నిబంధను మేరకు అవసరమైన సంఖ్యలో పారిశుద్ద్య సిబ్బంది పనిచేయాలని మంత్రి పేర్కోన్నారు. పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రి, ఎంసిహెచ్ కు 84 మంది పారిశుద్ద్య సిబ్బంది ఉండాలని, వీటి టెండర్ ప్రక్రియ ఫైనల్ చేసి నియామక ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి సూచించారు.

పెద్దపల్లి జిల్లాలో డయాగ్నస్టిక్ కేంద్రం నిర్మాణం ప్రారంభమయిందని, 6 నెలలో పూర్తవుతుందని, అప్పటి వరకు కరీంనగర్ జిల్లాలోని డయాగ్నస్టిక్ కేంద్రం సేవలు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరొగ్య కేంద్రంలో వైద్యులు సకాలంలో అందుబాటులొ ఉండాలని, ఆసుపత్రులలో సైతం వైద్యులు డ్యూటి సమయంలో ఆసుపత్రిలో మాత్రమే ఉండాలని మంత్రి స్పష్టం చేసారు. జిల్లాలోని ఆసుపత్రులను కలెక్టర్ ఆకస్మిక సందర్శించాలి, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి పై చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

- Advertisement -

రీవ్యూ మీటింగ్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, పెద్దపల్లి ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, వైద్యశాఖ ఆయుష్ కమీషనర్ అళుగు వర్షిణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్‌ ల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement