Wednesday, May 1, 2024

ద‌ళితుల భూముల‌ను రియ‌ల్ వ్యాపారుల‌ నుంచి కాపాడండి – కెసిఆర్ కు బండి లేఖ‌

హైదరాబాద్: దళితులు, గిరిజనుల భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలను ఆపాలని కోరుతూ బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ముఖ్య‌మంత్రి కెసిఆర్ కు బ‌హిరంగ లేఖ రాశారు.. సిద్దిపేటలో మీరు స్వ‌యంగా ప్రారంభించిన వెంచర్‌ దళితుల భూముల్లోనే అనే అంశం మీకు తెలుసా అని కెసిఆర్ ని ప్రశ్నించారు. శంషాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు ప్రయత్నిస్తున్నది గిరిజన భూముల్లోనేనని, ఇవి మచ్చుకు కొన్ని మాత్రమేనన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు, గిరిజనులకు కేటాయించిన అసైన్డ్‌ భూములను వారి నుంచి లాక్కుంటున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయని, సమాజంలో అత్యంత వెనుకబడిన దళితులకు, గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అని బండి సంజయ్ లేఖలో నిలదీసారు.


ఎన్నో ఏళ్ల క్రితం దళితులకు, గిరిజనులకు అసైన్‌ చేసిన భూములకు గులాబీ ప్రభుత్వం రక్షణ కల్పించకపోగా, వారి జీవనాధారాన్ని దెబ్బతీస్తూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని ప్రోత్సహించడం దుర్మార్గమన్నారు బండి. అంతే కాకుండా దళితులకు, గిరిజనులకు మూడు ఎకరాల సాగుభూమి ఇస్తామన్న హామీని గులాబీ ప్రభుత్వం వమ్ము చేయడంతో లక్షలాది మంది దళితులు, గిరిజనుల ఆశలు అడియాసలయ్యాయని అన్నారు.. ఎప్పుడో గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్‌ భూముల్లో దళిత, గిరిజన కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటుంటే రియల్‌ వ్యాపారం కోసం ఆ భూములను లాక్కోవాలని చూడడం వారి నోటి కాడి ముద్ద లాక్కోవడమేనన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిస్తానంటూ హామీలివ్వడమే కానీ, వాటిని అమలులో చూపెట్టడం లేదని ఫైర్ అయ్యారు.. దళితుల సంక్షేమమంటే ఎత్తైన విగ్రహాలు, పాలనా భవంతులకు పేర్లు కాదని, వారికి జీవనోపాధి కల్పించడమే ముఖ్యమన్నారు . ఇప్ప‌టికైనా ద‌ళితుల భూముల‌ను రియ‌ల్ ఎస్టేట్ క‌బంద‌హ‌స్తాల నుంచి విముక్తి చేసి, వారికి ఉన్న కనీస జీవనాధారాన్ని కాపాడాలని త‌న లేఖ‌లో సిఎం కెసిఆర్ ని కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement