Tuesday, May 14, 2024

జూన్ 19నుంచి బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ల్యాణోత్స‌వ వేడుక‌లు

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకలను అంగరంగ వైభవం నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ ఏర్పాట్లపై మంత్రి అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్‌ 19న ఎదుర్కోలు ఉత్సవం, 20న అమ్మవారి కల్యాణం, 21న రథోత్సవం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు నగరంతో పాటు రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశం
కల్యాణోత్సవ వేడుకలకు ముందే ఆలయ పరిసరాల్లో అవసరమైన మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. ఆలయానికి వచ్చే అన్ని రహదారులను ఎంతో అద్భుతంగా నిర్మించినట్లు తెలిపారు . అమ్మవారి కల్యాణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. వచ్చే లక్షలాది మంది భక్తులు దర్శనం సమయంలో ఇబ్బందులులేకుండా బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు . తాగునీటిని అందించేందుకు సిబ్బందిని నియమించాలని చెప్పారు. కల్యాణోత్సవం సందర్భంగా భక్తులకు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అన్నదానం చేస్తారని, వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. రథోత్సవం రోజున 500 మంది కళాకారులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా తాత్కాలికంగా మరిన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, వలంటీర్లకు ప్రత్యేక ఐడెంటిటీ కార్డులను అందజేయాలని పోలీసు, దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. కల్యాణం, రథోత్సవం జరిగే రెండు రోజుల పాటు ఆలయం వైపు వాహనాలు రాకుండా ట్రాఫిక్‌ను మళ్లించాలని సూచించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, వైద్యా ఆరోగ్యశాఖ జిల్లా అధికారి వెంకట్, ఐఅండ్‌పీఆర్‌ జేడీ జగన్, అగ్నిమాపక శాఖ అధికారి మధుసూదన్ రావు, దేవాదాయ శాఖ రీజనల్ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement