Sunday, April 28, 2024

Robot 2.0: అందుబాటులో రోబో 2.0 రెస్టారెంట్ …వినూత్న ప్ర‌యత్నానికి ప‌డిపోయిన ఫుడ్ ల‌వ‌ర్స్

భోజనం చేయడానికి హోటల్‌కు వెళ్తే ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన తర్వాత మామూలుగా అయితే మనుషులు ఆహారాన్ని తీసుకొచ్చి కస్టమర్లకు వడ్డిస్తారు. కానీ ఇక్కడ రోబోలే స్వాగతం పలుకుతాయి. మనతో మాట్లాడి ఫుడ్‌ ఆర్డర్‌ తీసుకుంటాయి. ఆర్డర్‌ చేశాకా ఆ ఫుడ్‌ను ప్లేట్‌లో రోబోలే పట్టుకొస్తాయి. ఇది ఎక్కడో కాదు సిద్దిపేట పట్టణం కరీంనగర్‌ రోడ్డులో ఇటీవలె ప్రారంభమైన ‘రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్‌’. ఈ హోటల్‌ యజమాని తీసుకొచ్చిన వినూత్న ఆలోచనకు భోజన ప్రియులు ఆకర్షితులవుతున్నారు.

సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్‌లో రెండు రోబోలను హైదరాబాద్‌ నుంచి రూ. 6 లక్షలకు కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఈ రోబోలు చార్జింగ్‌ బ్యాటరీల సాయంతో పని చేస్తాయి. భోజనం చేయడానికి హోటల్‌కు వెళ్లగానే ముందుగా రోబోలు కస్టమర్లు కూర్చున్న టేబుల్‌ వద్దకు వెళ్లి ‘నమస్కారం సార్, మేడమ్‌.. రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్‌కు స్వాగతం. నా పేరు మైత్రీ ఫుడ్‌ ఆర్డర్‌ చేయండి సార్‌ అని పలుకుతుంది. మనకు నచ్చిన‌ భోజనం ఆర్డర్‌ చేసిన తర్వాత మరో రోబో ఆర్డర్‌ చేసిన భోజనం ఫ్లేట్‌లో కస్టమర్‌ కూర్చున్న టేబుల్‌ వద్దకు తీసుకొస్తుంది. వేడి వేడి ఆహారాన్ని తీసుకొచ్చాను.. ధన్యవాదాలు సార్‌ అని చెబుతుంది.

ఆడుకోవడానికి గేమ్స్‌ జోన్‌..
ఇలా వినూత్న పద్ధతిలో భోజనం వడ్డిస్తూ కస్టమర్లను, భోజన ప్రియులను ఆకర్షిస్తుంది ఈ రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్‌. ఇప్పటికే సిద్దిపేటలో ట్రైన్‌ రెస్టారెంట్‌ను నిర్వాహకులు నడుపుతున్నారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా, కస్టమర్లను ఆకర్షించే విధంగా వినూత్న పద్ధతిలో రోబోలను ఏర్పాటు చేసి వాటి సాయంతో భోజనాన్ని సరఫరా చేస్తూ హోటల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ రోబో ఫ్యామిలీ రెస్టారెంట్‌లో చిన్న పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా గేమ్స్‌ జోన్, రాత్రి సమయంలో ప్రత్యేక లైటింగ్, హోం థియేటర్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement