Monday, November 11, 2024

అమిత్ షా ఖ‌బ‌డ్దార్…ఎంపి అస‌దుద్దీన్ ఓవైసీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణాలో అధికారంలోకి వస్తే కేసీఆర్‌ ప్రభుత్వం కల్పిస్తున్న ముస్టిం మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించడాన్ని ఆల్‌ ఇండియా మజ్లిస్‌ పార్టీ (ఏఐఎంఐఎం) జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖబడ్దార్‌ అమిత్‌ షా.. మా జోలికొస్తే ఊరుకోం.. అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మత విధ్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు రాబట్టాలనుకోవడం తెలంగాణాలో సాధ్యం కాదన్నారు. బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తామనుకోవడం కల మాత్రమేనని ఎద్దేవా చేశారు. అమిత్‌షా వ్యాఖ్యలు చూస్తుంటే, తెలంగాణలో బీజేపీకి ఓటు- వేస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నట్లుగా ఉన్నాయన్నారు.


వెనుకబడిన ముస్లింలను చేరదీయాలని ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతుండగా, వారి రిజర్వేషన్లను తొలగిస్తామని అమిత్‌ షా హామీ ఇస్తుండడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వెనుకబడిన ముస్లిం వర్గాలకు రిజర్వేషన్లు అనుభావిక డేటా ఆధారంగా ఉన్నాయని ఈ సందర్భంగా అమిత్‌ షాకు గుర్తు చేశారు. ”సుధీర్‌ కమిషన్‌ నివేదిక చదవండి. మీరు అవగాహన లేకపోతే, నిపుణులను ఎవరినైనా అడగండి” అంటూ ఓవైసీ సూచించారు. సుప్రీంకోర్టు స్టే కింద ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు.


విషయం తెలుసుకోకుండా స్థానిక నాయకులు చెవిలో ఊదిందే తడువుగా చేవెళ్ల బహిరంగ సభలో అమిత్‌ షా ముస్లిం రిజర్వేషన్ల మాట్లాడి పప్పులో కాలేశారని ఓవైసీ వ్యాఖ్యానించారు. ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని హామీ ఇవ్వడం వెనుక రాజకీయ కుట్ర కనిపిస్తోందన్నారు. ముస్లింల కోటా రాజ్యాంగ విరుద్ధమని, రిజర్వేషన్‌ అనేది షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల హక్కు అని సూచించారు. ”తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లిం రిజర్వేషన్లను అంతం చేస్తాం.. ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కు” అని కేంద్ర హోంమంత్రి స్థానంలో ఉన్న అమిత్‌షా ప్రకటించడం దుర్మార్గమని, బాధ్యతా రాహిత్యమని అసదుద్దీన్‌ తీవ్రంగా ఖండిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement