Wednesday, May 1, 2024

TS | బదిలీలు ఇప్పట్లో లేనట్టే.. మళ్లి వాయిదా పడిన కేసు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కేసు ఇప్పట్లో తెలేట్టుగా కనబడటంలేదు. మరికొంత సమయం పట్టనున్నట్లుగా ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. బదిలీలు, పదోన్నతులు కేసుపై దాదాపు గత ఐదు నెలలుగా విచారణ సాగుతునే ఉండడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బదిలీలు, పదోన్నతులు పూర్తయితేగానీ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగేలా కనిపించడంలేదని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఈక్రమంలో డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఈ కేసుకు లింకు ఉండడంతో ఇప్పట్లో ఈ బదిలీల సమస్య పరిష్కారమయ్యేట్లుగా కనబడటంలేదని బాధిత ఉపాధ్యాయులు చెబుతున్నారు.

దీంతో ఇక టీచర్ల బదిలీలు, పదోన్నతులతోపాటు డీఎస్సీ లేదా టీఆర్‌టీ (టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌) నోటిఫికేషన్‌ కూడా ఇక ఎన్నికలయ్యాకే ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయుల బదిలీల కేసు గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే కేసుకు సంబంధించిన ఓ న్యాయవాది రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా కోర్టుకు హాజరుకాలేకపోవడంతో ఈకేసును కోర్టు ఆగస్టు 3వ తేదీన వాయిదా వేసింది. ఇప్పటికే పలు మార్లు ఈ కేసు వాయిదా పడుతూ వచ్చింది. మరోవైపు సాధారణ ఎన్నికల గడువు కూడా సమీపిస్తోంది.

- Advertisement -

మరో రెండుమూడు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో బదిలీల కేసు వాయిదాపడుతుండటం చూస్తుంటే ఇక ఎన్నికలయ్యాకే ఈ బదిలీల ప్రక్రియ ఉంటుందనే చర్చ ఉపాధ్యాయుల్లో జరుగుతోంది.
రాష్ట్రంలో ఉపాధ్యాయ వర్గం తీవ్ర అసంతృప్తి, అసహనంలో ఉంది. దాదాపు ఎనిమిదేళ్లుగా ప్రమోషన్లు పొందక, ఐదేళ్లుగా బదిలీలు లక ఆందోళనలో ఉన్నారు. అయితే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వివిధ కేడర్ల ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది.

అన్ని అర్హతలు ఉన్న దాదాపు 56,829 మందిని అక్కడి ఏపీ విద్యాశాఖ బదిలీ చేసింది. పోస్టుల బ్లాక్‌లు, స్పౌజ్‌, నాన్‌ స్సౌజ్‌ సమస్యలు, యూనియన్‌ నేతల ఫైరవీలు, కోర్టు కేసులకు తావు లేకుండా బదిలీల ప్రక్రియను సాఫీగా ముగించేసింది. కానీ మన దగ్గర మాత్రం దాదాపు 80 వేల ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను విద్యాశాఖ ఇంత వరకు పూర్తిచేయలేకపోయింది. ఈ ఏడాది ప్రారంభంలోనే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదలై, ప్రక్రియ ప్రారంభమైన కొన్ని రోజులకే కొంత మంది ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించడంతో తెలంగాణలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు అడ్డుకట్టపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు ఐదు నెలలుగా ఈ కేసు విచారణకు రావడం, వాయిదా పడడం జరుగుతోంది. కేసులతో అడ్డుకుంటున్నది ఉపాధ్యాయులేనని అధికారులు భావిస్తుంటే, కోర్టు చిక్కులు తొలగిపోయేలా.. ఈ బదిలీల అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను ప్రభుత్వం ఏమాత్రం చేయడంలేదని పలువురు టీచర్లు ఆరోపిస్తున్నారు.

ఎన్నికల కోసం నాన్చుతున్నారా!…

ఎన్నికల కోసం కావాలనే టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ను ప్రభుత్వం నాన్చుతుందని అభ్యర్థులు అంటున్నారు.
అన్నిరకాల ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి కేవలం డీఎస్సీని మాత్రం ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తున్నారు. టీచర్‌ నోటిఫికేషన్‌ కోసమే దాదాపు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇంతవరకు టీచర్‌ ఖాళీల భర్తీకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో డీఎడ్‌, బీఎడ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఉపాద్యాయ బదిలీలు, పదోన్నతులకు.. డీఎస్సీకు అధికారులు లింకు పెడుతున్నారని అభ్యర్థులు చెబుతున్నారు. ఎన్నికల ముందు నోటిఫికేషన్‌ వేసి దాన్ని ప్రచార అస్త్రంగా మలుచుకునే యోచనలో ప్రభుత్వం ఉందని, అందుకే నోటిఫికేషన్‌ను ఆలస్యం చేస్తున్నారనే అభిప్రయాలను వారు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement