Monday, April 29, 2024

ప్రేమ‌పేరుతో మోసం, బాలికకు అబార్షన్ కేసులో నిందితుల అరెస్టు.. పరారీలో అస‌లు దోషి

వరంగల్ క్రైమ్ (ప్ర‌భ న్యూస్‌) : మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ప్రెగ్నెన్సీకి కార‌ణ‌మై.. ఆ బాలికకు చట్ట విరుద్ధంగా అబార్షన్ చేసిన నిందితులను వ‌రంగ‌ల్ జిల్లా ఇంతేజార్ గంజ్ పోలీసులు ఇవ్వాల అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లోని మెడికల్ షాప్ వెనుకాల ఎలాంటి అనుమతులు, డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా బాలిక ప్రాణాలతో చేలాగాటమాడిన ఘ‌ట‌న‌లో పోలీసులు ద‌ర్యాప్తు ఆధారంగా నిందితుల‌ను క‌నిపెట్టారు.

ఇక‌.. అబార్షన్ చేయడానికి కారకులైన వారందరిని అరెస్ట్ చేశారు. ఇంతేజార్ గంజ్ సీఐ మల్లేష్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వ‌రంగ‌ల్‌లోని ఏనుమాముల ఏరియా బాలాజీనగర్ కు చెందిన బాధిత బాలికతో అదే కాలనీకి చెందిన కక్కర్ల ఆకాష్ అనే యువకుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు. ప్రెగ్నెన్సీకి కార‌ణ‌మ‌య్యాడు. ఆ తర్వాత ఈ విష‌యం బ‌య‌ట‌కు తెలియ‌కుండా ఉండేందుకు మైనర్ బాలికకు అబార్షన్ చేయించాడు.

ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చిన కథనాలు.. స్పందించిన పోలీసులు

ఇక‌.. గర్భందాల్చిన 14 ఏళ్ల బాలికను స్టేషన్ ఘన్ పూర్ లోని ఓ మెడికల్ షాప్ వెనుక భాగంలో ట్రీట్‌మెంట్ చేయించాడు. అక్రమంగా ఆపరేషన్ థియేటర్ నిర్వహిస్తున్న స్టాఫ్ నర్సు, లాబ్ టెక్నీషియన్ ఈ అబార్ష‌న్ నిర్వ‌హించిన‌ట్టు పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. కాగా, ఈ కేసులో అబార్షన్ కి సహకరించిన అయిదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఇంతేజార్ గంజ్ సీఐ మల్లేశ్‌ యాదవ్ తెలిపారు.

ప్ర‌ధాన నిందితుడు కక్కేర్ల ఆకాష్ కాగా, అత‌నికి స‌హ‌క‌రించిన వారిలో కక్కేర్ల రాధిక , కక్కేర్ల హర్షిత , శాయంపేటకు చెందిన లాబ్ టెక్నీషియన్ బొమ్మేర మనోహర్, జఫర్ గడ్ మండలం తిమ్మంపేటకు చెందిన స్టాఫ్ నర్సు లకావత్ వెంకటరామ్, కాజీపేట కడిపికొండకు చెందిన మరో స్టాఫ్ నర్సు స్రవంతి ఉన్నారు. నిందితుల‌ను అరెస్ట్ చేశామ‌ని, ప్రధాన నిందుతుడు ఆకాష్ పరారీలో ఉండ‌గా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు సీఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement