Saturday, May 11, 2024

Breaking: అందలమెక్కించిన పార్టీకి ద్రోహం, ఓదెలు ఆరోపణలు సిగ్గుచేటు: టీఆర్​ఎస్​

సామాన్యుడుని మూడుసార్లు ఎమ్మెల్యే చేసి అందలమెక్కిన టిఆర్ఎస్ పార్టీకి నల్లాల ఓదెలు కుటుంబం ద్రోహం చేయడం సిగ్గుచేటని చెన్నూరు టీఆర్​ ఎస్​ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఒక సామాన్య కార్యకర్త అని ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కున చేర్చుకుని మూడు సార్లు ఎమ్మెల్యేగా చేయడంతో పాటు ఆయన భార్యకు జెడ్పి చైర్ పర్సన్ గా పదవులు కట్టబెట్టినా పార్టీపై దుష్ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. నల్లాల దంపతులు మాట్లాడిన మాటలు సరైనవి కావన్నారు. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ జిల్లాలో, నియోజకవర్గంలో నిర్వహించిన ప్రతీ కార్యక్రమానికి ఓదెలును ఆహ్వానించారని, వారిని ఆహ్వానించిన ప్రతి సందర్భంలో సుమన్ సముచిత గౌరవం అందించారని తెలిపారు.

బాల్క సుమన్ శాసనసభ్యులు గా నియమితులైన అనంతరం నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంటే వారి కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పన్నిన కుట్రలో భాగంగా చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోవడంలో పన్నిన పన్నాగంలో నల్లాల దంపతులను ఒక పావుగా వాడుకుంటున్నారన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లాల ఓదెలు నియోజకవర్గానికి, పార్టీకి ఒరగబెట్టింది ఏమీ లేదని, నమ్మి మూడుసార్లు గెలిపించినందుకు పార్టీకి చెన్నూరు ప్రజలకు తీరని ద్రోహం చేశారన్నారు. పార్టీ పైన, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. స్వలాభం, స్వప్రయోజనాల కోసమే పార్టీని వీడారని వారి వెంట ఒక్క నాయకుడు కూడా నడవకపోవడం వారి బలమెంటో తెలియజేస్తుందని,ఎప్పటికీ చెన్నూరు నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ కంచుకోట అని ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా, దుర్మార్గపు రాజకీయాలు చేసినా నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి తప్పా వేరే వారికి స్థానం లేదన్నారు.

ఎమ్మెల్యే బాల్క సుమన్ నాయకత్వంలో 1658 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల పథకం, 500 కోట్లతో మూడు మున్సిపాలిటీల అభివృద్ధి, 400 కోట్లతో రోడ్లు, బ్రిడ్జిలు, అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, అభివృద్ధి పనులు పూర్తయితే నియోజకవర్గంలో విపక్షాలకు నూకలు కూడా దొరకవని, చిల్లర రాజకీయాలకు తెరలేపారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని, ఎమ్మెల్యే నాయకత్వంలో వచ్చే ఏడాది కాలంలో చెన్నూరు రూపురేఖలు మారనున్నాయని, వారి నాయకత్వంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. ముమ్మాటికీ చెన్నూరు గడ్డ గులాబీ కంచుకోట అని, ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement