Thursday, April 25, 2024

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు ఎన్‌సీడీ క్లినిక్‌లు.. ఫ్రీగానే బీపీ, షుగర్ చికిత్సలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీపీ, షుగర్‌, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎన్‌సీడీ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో 26 జిల్లా స్థాయి ఎన్‌సీడీ క్లినిక్‌లు, 54 సీహెచ్‌సీ ఎన్‌సీడీ క్లినిక్స్‌ త్వరలో ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే తెలంగాణలో 47 సీహెచ్‌సీ ఎన్‌సీడీ క్లినిక్‌లు పనిచేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని 90లక్షల మందికి ఎన్‌సీడీ టెస్టులు చేశారు. వీరిలో బీపీ, షుగర్‌, గుండె, కిడ్నీ సంబంధిత దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారిని గుర్తించి… ఉచితంగా మందులను, చికిత్సను అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోంది. ప్రజారోగ్యానికి సంబందించి దేశంలోనే ఎక్కడా లేనివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాత్మక అడుగుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్‌సీడీ (అసంక్రమిత వ్యాధుల నిర్ధారణా పరీక్షలు) స్క్రీనింగ్‌ శరవేగంగా అమలవుతోంది. ఈ క్రమంలో పేద ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. మారిన జీవన శైలి మూలంగా ఇప్పుడు బీపీ, షుగర్‌వంటి అసంక్రమిత వ్యాధులు సర్వసాధారణమయ్యాయి. బీపీ, షుగర్‌తోపాటు గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లు తదితర దీర్ఘకాలిక జబ్బులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే రాష్ట్రంలో చాలా మంది పేదలకు తమకు ఏ రోగాలు వచ్చాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అందుబాటులో ఉచిత వ్యాధి నిర్ధారణ సదుపాయాలు ఉన్నా… ఏమరుపాటుగా ఉంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు.

మూడు పదులు దాటిన వారందరికీ టెస్టులు..

ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చిన్న గోలితో అదుపు చేయగలిగే రోగాలనూ నిర్లక్ష్యం చేయడం మూలంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రజలందరికీ నాన్‌ కమ్యూనబుల్‌ డిసీజ్‌ టెస్టును రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 ఏళ్లు పైబడిన వారందరికీ అసంక్రమిత వ్యాధుల టెస్టులు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న వైద్య సిబ్బంది మూడు పదులు దాటిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టుల వివరాలను కాంప్రహెన్సివ్‌ ప్రైమరీ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోటి 5లక్షల మంది ఎన్‌సీడీ స్క్రీనింగ్‌కు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 90లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 14లక్షల మందికి బీపీ, అంటే 6.6శాతం మందికి షుగర్‌ ఉన్నట్లు నిర్దారణ జరిగింది.

కొవిడ్‌ తర్వాత పెరిగిన బీపీ, షుగర్‌ బాధితులు..

కొవిడ్‌ తర్వాత బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్థుల సంఖ్య తెలంగాణలో పెరిగినట్లు ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2017-19 మధ్య దశలవారీగా ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ నిర్వహించగా రాష్ట్ర వ్యాప్తంగా 12శాతం మంది బీపీతో బాధపడుతున్నారు. అదే తాజాగా నిర్వహించిన ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ టెస్టుల్లో బీపీ వ్యాధిగ్రస్థుల శాతం 14.4శాతానికి పెరిగింది. గతంలో 5.33 శాతం ఉన్న షుగర్‌ బాధితుల సంఖ్య కొవిడ్‌ తర్వాత ఇప్పుడు 6.6శాతానికి చేరింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement