Thursday, December 7, 2023

TS: త్వ‌ర‌లో ఎయిర్ అంబులెన్స్‌లు.. ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్ కేంద్రం.. హరీశ్ రావు

త్వరలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎయిర్ అంబులెన్సులు, ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. రవీంద్ర భారతి వేదికగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ పదేళ్ల ప్రగతి నివేదికను మంత్రి హరీశ్ రావు ఇవాళ విడుద‌ల చేశారు. ఇదే వేదికగా 310 మంది ఫార్మసిస్టులకు మంత్రి హ‌రీశ్‌రావు పోస్టింగ్ ఆర్డర్స్ అందజేశారు.

- Advertisement -
   

ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ… నేడు ఫార్మసిస్టులుగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతూ వైద్య ఆరోగ్యశాఖ కుటుంబంలో చేరుతున్న 310 మంది ఫార్మసిస్టులకు స్వాగతం తెలిపారు. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిధిలో 105, టీవీవీపీ పరిధిలోని 135, డీఎంఈ 70 పోస్టులకు గాను మొత్తం 310 మంది ఎంపికయ్యార‌ని పేర్కొన్నారు. ఆస్పత్రిలో సేవలు బాగుండాలంటే అందరికీ తగినన్ని ఔషధాలు ఉండాలన్నారు. ఔషధాలను సమకూర్చడం, రోగులకు అందించడంలో ఫార్మసిస్టులది కీలకపాత్ర అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం అనేది గొప్ప అవకాశమన్నారు. ప్రైవేటు ఉద్యోగాలతో ఉపాధి దొరికితే.. ప్రభుత్వ ఉద్యోగులకు.. ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతుందన్నారు. రోగులకు చిరునవ్వుతో మందులు అందిస్తే వారు ఎంతో సంతోషిస్తారని హ‌రీశ్‌రావు తెలిపారు.

119 నియోజ‌క‌వ‌ర్గాల్లో డ‌యాల‌సిస్ కేంద్రాలు…
119 నియోజక వర్గాల్లో ఒక్కో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించార‌ని మంత్రి తెలిపారు. అవయవ మార్పిడుల్లో దేశంలోనే తెలంగాణ భవిష్కరణలో ఉందని కేంద్రం ఇటీవలే చెప్పిందన్నారు. ముఖ్యంగా నిమ్స్ ఆస్పత్రిలో ఆరు నెలల్లోనే 100 కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లు పూర్తయ్యాయన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు. గాంధీ ఆస్ప‌త్రిలో 8వ ఫ్లోర్‌లో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో ప్రతినెల సగటున 8మందికి బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ ఉచితంగా చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో దేశ విదేశాల నుంచి వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో అవయవ మార్పిడులు చేసుకునేలా మారబోతున్నాయన్నారు. ఔషధాల అందుబాటు, పంపిణీ ప్రక్రియలో తెలంగాణ గతంలో మూడో స్థానంలో ఉండేదన్నారు. త్వరలో రెండో స్థానంలోకి చేరబోతుందన్నారు. కొత్తగా ఫార్మసిస్టులు చేరికతో మొదటి స్థానానికి చేరుకుంటుందని ఆశిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement