Monday, April 29, 2024

కాపాడ‌బోయి అనంతలోకాలకు.. ఇద్దరు సింగరేణి రెస్క్యూ సిబ్బంది మృతి

నస్పూర్ : ఆపదలో ఉన్న వారిని రక్షించబోయి… అనంత లోకాలకు వెళ్లిన హృదయ విషాద సంఘటన శ్రీరాంపూర్ ఏరియాలో చోటు చేసుకుంది. సింగరేణిలో ఉద్యోగం చేస్తూ ఆపదలో ఉన్న వారిని రక్షించి వారి కుటుంబాల్లో వెలుగు నింపేందుకు ఎంతో మక్కువతో సింగరేణి రెస్క్యూ టీంలో చేరిన ఇద్దరి కార్మికుల కుటుంబాల్లో చీకటి అలుముకుంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం కాగా.. దహేగం మండలం బీబ్రా పెద్దవాగు బ్యాక్ వాటర్ రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొన్న సింగరేణి రెస్క్యూ టీమ్ మెంబర్స్ అంబాల రాము (28) జనరల్ మజ్దూర్, ఆర్కె 5, సీహెచ్.సతీష్ (36) ఇపి ఆపరేటర్ ఎస్ఆర్పి ఓసీపీ.

బుధవారం మధ్యాహ్నం గల్లంతైన విషయం తెలిసిందే. వెంటనే శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి.సంజీవరెడ్డి ఆదేశాల మేరకు రెస్క్యూ స్టేషన్ నుండి రెండు రెస్క్యూ బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు. ఆర్కె 5, శ్రీరాంపూర్ ఉపరితల గని నుండి అధికారుల బృందం సైతం బయల్దేరారు. పెసరకుంట గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో సింగరేణి రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన రెస్క్యూ టీం ఆపరేషన్ రెస్క్యూ చేస్తుండగా అధిక వర్షంవల్ల కొమురం భీం ప్రాజెక్టు గేట్లు తెరవడంతో నీటి ప్రవాహం పెరిగి వరదల్లో గల్లంతయ్యారు. పెసర కుంట గ్రామ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో ప్రమాదానికి గురై మృతి చెందడంతో, రెస్క్యూ టీం సభ్యులు మరణించారనే వార్తతో వారి కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతుడు సిహెచ్ సతీష్ కి భార్య మమత, కొడుకు రిషిక్, కూతురు క్రీతిహన్సి, అంబాలా రాముకి భార్య స్పందన, సంవత్సరం కొడుకు వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement