Thursday, May 2, 2024

విధి వంచితుడి ధీర‌త్వం.. చేతులు లేకున్నాకాళ్ల‌తో ప‌రీక్ష రాసిన విద్యార్ధి..

మంచిర్యాల, ప్రభన్యూస్‌ ప్రతినిధి: చిన్నతనంలో విధి వంచించినా ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందడుగు వేయాలని, చేతులు లేకపోయినా కాళ్లతో పరీక్షలు రాస్తూ ముందుకు సాగుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామానికి చెందిన ఏలూరి శంకర్‌ 9 తరగతి చదువుతుండగా విద్యుత్‌ షాక్‌తో తన రెండు చేతులు కోల్పోయాడు. విద్య ద్వారానే జీవన ఉన్నతికి చేరుకోవచ్చునని భావించి నాటి నుండి నేటి వరకు పట్టు వీడకుండా మనో ధైర్యంతో చదువుతూ నేడు డిగ్రీ పరీక్షలను కాళ్లతో రాశాడు.

బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌ మొదటి సంవత్సరం చదువుతున్న శంకర్‌ శుక్రవారం ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలలో భాగంగా స్థానిక భవిత డిగ్రీ కళాశాలలో పరీక్షా సెంటర్‌కు చేరుకొని కాళ్లతో పరీక్ష రాసి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. భవిష్యత్తులో మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తానని నమ్మకంగా చెప్తున్నాడు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న యువత చెడు మార్గాన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేటి రోజుల్లో రెండు చేతులు లేకపోయినప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగుతున్న శంకర్‌ను ఆదర్శంగా తీసుకొని తమ జీవితాలను మెరుగు పర్చుకోవాలని ఆ కళాశాల అధ్యాపకులు యువతకు సూచిస్తున్నారు. మా కళాశాలలో శంకర్‌ చేరడం కళాశాలకు కూడా గర్వకారణని వారు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement