Friday, May 17, 2024

పచ్చదనం, పరిశుభ్రతతో ఆదర్శంగా నిలుస్తున్న పల్లెలు..

మంచిర్యాల : రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి బాటలోకి తీసుకువచ్చేందుకు పలు కార్యక్రమాలను చేపట్టింది. గ్రామాలు అభివృద్ది బాట పడుతుండటంతో గ్రామ స్వరాజ్యం సహకారమవుతోంది. మౌళిక వసతుల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ప్రకృతి వనాలు, వైకుంఠ దామాలు, రైతువేదికలు, డంపింగ్‌ యార్డులు, వరి మార్పిడి కల్లాలు జిల్లాలోని ప్రతి గ్రామపంచాయితీలో నిర్మాణాలు పూర్తై నేడు పచ్చదనం పరిశుభ్రతతో పల్లెలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చే ఆరోగ్య సమస్యలు దీంతో దూరమవుతున్నాయి. ఇంటింటికి చెత్త సేకరణ ద్వారా పల్లెల్లో పరిశుభ్రత కనిపిస్తోంది. ప్రకృతి వనాల ఏర్పాట్లు, హరితహారం కార్యక్రమంతో మొక్కల పెంపకం రోజువారీ విధానంగా మారింది. దీంతో పల్లెలు పచ్చధనంతో కనిపిస్తున్నాయి. రైతువేదికల ద్వారా రైతులంతా సమావేశం అయ్యేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. వైకుంఠదామాల నిర్మాణాలతో దశాబ్దకాలంగా నోచుకోని పనులు నేడు సాగుతున్నాయి. ప్రతీనెలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పంచాయితీలకు నిధులు వస్తుండటంతో అభివృద్ధి బాటన పల్లెలు సాగుతున్నాయి. గతంలో పల్లెలంటే చెత్తాచెదారం, బురదమయమైన రోడ్లతో కలావిహీనంగా కనిపించేవి. నేడు పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా అభివృద్ధి పనులు సాగుతుండటంతో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. డంపింగ్‌ యార్డుల నిర్మాణాల ద్వారా సేంద్రీయ ఎరువుల తయారీకి గ్రామపంచాయితీలు చర్యలు తీసుకుంటుండటంతో ఆర్థికంగా కూడా అవి బలోపేతం అయ్యేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. జిల్లాలోని 16 మండలాల్లోని 311
గ్రామపంచాయితీల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. హరితహారం కార్యక్రమం ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో 40 లక్షల మొక్కలను పెంచినట్లు పంచాయితీ రాజ్‌ అధికారులు పేర్కొంటున్నారు. 311 గ్రామపంచాయితీలకు గాను 296 గ్రామపంచాయితీల్లో డంపింగ్‌ యార్డుల్లో నిర్మాణం పూర్తైంది. శ్మశానవాటికల నిర్మాణాలకు సంబంధించి 66 పూర్తి కాగా మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రకృతి వనాలకు సంబంధించి 187 ప్రకృతి వనాలు పూర్తి కాగా 344 నిర్మాణ దశలో ఉన్నాయి. వరి మార్పిడి కల్లాలకు సంబంధించి 11 పూర్తి కాగా 307 నిర్మాణ దశలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 311 గ్రామపంచాయితీల్లో 152 గ్రామపంచాయితీలకు సొంత భవనాలు ఉండగా మిగతా గ్రామపంచాయితీల్లో కూడా భవనాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తడి, పొడి చెత్త సేకరణతో పాటు ట్రాక్టర్‌ ట్యాంకర్ల ద్వారా హరితహారంలో ఏర్పాటు చేసిన మొక్కలకు నీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో చెట్లు పచ్చధనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు ప్రతీఒక్కరికి ఉపాది లభించేలా జాతీయ గ్రామీణ ఉపాది పథకం తోడ్పాటును అందిస్తోంది. ఫుట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాట్లు, వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాట్ల ద్వారా స్వశక్తితో ముందుకు సాగేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాలు స్వచ్చత బారీన సాగడంతో పాటు పల్లెలు ప్రగతి వైపు సాగేందుకు దోహదపడుతోంది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలతో పోటీ పడుతూ అభివృద్ధి బాటన సాగేందుకు ఆస్కారం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement