Thursday, April 25, 2024

కోరలు చాచుతోన్న కరోనా –వ్యాక్సిన్‌ కోసం క్యూ

తాండూరు : కరోనా మహమ్మారి కోరలు చాచుతోంది. తాండూరు మండలంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా సబ్దుగా ఉన్న కరోనా ‌ నానాటికి పెరుగుతూ ప్రజలపై పంజా విసురుతోంది. గత వారం రోజులుగా పదుల సంఖ్యలో కరోనా పాజిటీవ్‌ కేసులు నిర్దారణ అవుతుండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ కరోనా మహమ్మారి ప్రభావంతో మండలంలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. తాజాగా 16 మంది కరోనా వైరస్‌ భారిన పడ్డారు. ఈ నెల 15వ తేదిన 8, 17వ తేదిన 20, 19వ తేదీన 15 కేసులు నిర్దారణ కావడం కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. ఓ వైపు కరోనా పాజిటీవ్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు వ్యాక్సిన్‌ కోసం ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు. రోజు పదుల సంఖ్యలో ఆసుపత్రుల వద్ద బారులు తీరుతూ వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారు. వ్యాక్సిన్‌ వేసే తొలి రోజుల్లో అపోహలతో టీకాకు దూరంగా ఉన్న ప్రజలు ప్రస్తుతం టీకా వేసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. ఏది ఏమైనా కరోనా వైరస్‌ తీవ్రత మాత్రం అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రజలు సహకరించాలి : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలని తాండూరు, మాదారం ఎస్సైలు శేఖర్‌ రెడ్డి, మానసలు అన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే రాత్రివేళల్లో కర్ఫ్యూను అమలు చేస్తున్నామన్నారు. ప్రజలంతా సహకరించి అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని, తప్పనిసరిగా సమదూరం పాటిస్తూ శానిటైజేషన్‌ చేసుకోవాలని అన్నారు. ప్రతీఒక్కరు స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా వైరస్‌ను నియంత్రించగల్గుతామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement