Thursday, May 2, 2024

ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో నిందితులు కోర్టుకు.. 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో నిందితులు అనిల్‌కుమార్‌, అభిషేక్‌ల కస్టడీ ముగియడంతో పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. దీంతో న్యాయస్థానం నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో పోలీసులు జైలుకు తరలించారు. నిందితులను నాలుగు రోజులపాటు విచారించిన బంజారాహిల్స్‌ పోలీసులు కస్టడీ కన్ఫేషన్‌ స్టేట్‌మెంట్‌ను కోర్టులో దాఖలు చేశారు. నాలుగు రోజుల కస్టడీ విచారణలో పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగిన నిందితులు నోరు మెదపలేదు. కస్టడీ విచారణలో ఏ మాత్రం నిందితులు సహకరించకపోవడంతో ఈ కేసును కొలిక్కి తీసుకురావడం పోలీసులకు పెద్ద ఇబ్బందిగా మారింది.

ఈ నెల 3న ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌పై దాడి జరిగిన తర్వాత నిర్వాహకుడు అభిషేక్‌, మేనేజర్‌ అనిల్‌ను అరెస్టు చేసిన పోలీసులు డెస్క్‌ మీద ఉన్న ఐదు మిల్లిగ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయన్న చిక్కుముడి వీడితే కేసు దర్యాప్తు వేగంగా పురోగతి సాధిస్తుందని పోలీసులు అంటున్నారు. అయితే డ్రగ్స్‌ గురించి తమకేం తెలియదని కస్టడీ విచారణలో నిందితులు తేల్చి చెప్పడంతో కేసు చిక్కుముడిగా మారుతుందని పోలీసులు వాపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement