Sunday, April 28, 2024

తెలంగాణలో తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటింగ్ – కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌

హైదరాబాద్ – తెలంగాణలో 2022-23 ఏడాదిలో 22 లక్షలకుపైగా ఓట్లను పరిశీలించి తొలగించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. శాసనసభ ఎన్నికల సన్నాహకాలపై సమీక్ష కోసం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ముగిసింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ (సీఈసీ) ఇతర కమిషనర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయన వెల్లడించారు

తెలంగాణలో స్త్రీ, పురుష ఓటర్లు దాదాపు సమానంగా ఉండటం శుభపరిణామం. సమాజంలోని అన్ని వర్గాలను ఓటింగ్‌లో భాగస్వామ్యం చేస్తున్నాం. యువ ఓటర్ల సంఖ్య 8 లక్షలు దాటడం ప్రశంసనీయం. రాష్ట్రంలో 2022 – 23 ఏడాదిలో 22 లక్షలకుపైగా ఓట్లను పరిశీలించి తొలగించాం. ఏకపక్షంగా ఓట్లను తొలగించలేదు. ఫామ్ అందిన తర్వాతే తొలగించాం. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యాం. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావంపై కొన్ని పార్టీలు ఆందోళన వెలిబుచ్చాయి. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరగొచ్చని కొన్ని పార్టీలు ఆందోళన చెందాయి. బుధవారం ఓటర్ల తుది జాబితా కూడా వెల్లడించాం.

- Advertisement -

జులై తర్వాత దరఖాస్తు చేసుకున్న 2.21 లక్షల యువతకు ఓటు హక్కు కల్పించాం. 66 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 18 – 19 ఏళ్ల యువ మహిళా ఓటర్లు 3.45 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం పోలింగ్‌ స్టేషన్‌లు 35,356 ఉండగా.. ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌లో సగటు ఓటర్ల సంఖ్య 897గా ఉంది. ఫిర్యాదుల స్వీకరణ కోసం సీ విజిల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం” అని రాజీవ్‌కుమార్‌ వివరించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement