Monday, April 29, 2024

కేసీఆర్ ను ప్రశ్నిస్తా.. జులై 8న కొత్త పార్టీః షర్మిల

తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని, ఆ అవినీతిని, అరాచకాలను ప్రశ్నించడానికే తాను పార్టీ పెట్టి ప్రజల ముందుకు వస్తున్నానని వైఎస్ షర్మిల అన్నారు. సింహం సింగిల్‌గా వస్తుందన్న షర్మిల.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాబోయే జయంతి జులై 8న కొత్త పార్టీని ఆవిష్కరించనున్నట్లు వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. అదే రోజుల పార్టీ జెండాను కూడా ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. ఖమ్మంలోని పేవిలియన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన  సంకల్ప సభలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు.  ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వ తీరును ఆమె తీవ్ర స్థాయిలో ఎండగట్టారు.

ప్రతి రైతు రాజు కావాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారని వైఎస్ షర్మిల అన్నారు. 16 లక్షల ఎకరాల భూమి సాగు చేయడమే లక్ష్యంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. రూ. 38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రీడిజైన్ల పేరుతో లక్ష కోట్లకు పైగా వ్యయం పెంచారని, ఇది అవినీతిలో భాగమే అని వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. వీటన్నింటిని ప్రశ్నించడానికి, నిలదీయడానికి పార్టీ అవసరం అని షర్మిల పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దొరగారి ఎడమకాలి చెప్పుకింద నలిగిపోతోందని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. భౌతికంగా తెలంగాణను సాధించుకున్నా.. ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలకు కారణం ఎవరు? అని షర్మిల ప్రశ్నించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చారా? అని నిలదీశారు. ప్రజల సమస్యలు వినే ఓపిక ఇప్పటి నేతలను ఉందా? అని ప్రశ్నించారు. తాను వెళ్లని సచివాలయాన్ని సీఎం కూలగొట్టించారని షర్మిల మండిపడ్డారు. ఉద్యోగాలు రావడం లేదని సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు.. ఉద్యోగం లేదు.. యువతకు ఉపాధి లేదు అని విమర్శించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ కుటుంబానికే నిధులు, నియామకాలు దక్కాయని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని ధ్వజమెత్తారు. స్వరాష్ట ఫలాలు ప్రగతి భవన్‌ గేటు దాటి సామాన్యులకు ఎక్కడ చేరుతున్నాయి? అని ఆమె ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ వాగ్దానం చేసిన కేసీఆర్.. రుణమాఫీ చేశారా? అని ప్రశ్నించారు. రైతుల పేరుమీద అప్పులు చేసి వారి జేబులు నింపుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్ పాలనను పునఃప్రతిష్ట చేయబోతున్నాం వైఎస్ షర్మిల ప్రకటించారు. పదవుల కోసం కాదు, ప్రజల కోసం నిలబడతానని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్నయినా తాను అడ్డుకుంటానని అన్నారు. తనకు అవకాశం ఇవ్వాలో, వద్దో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. నేటి కార్యకర్తలే రేపటి నాయకులని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement