Thursday, May 2, 2024

టీఆర్ఎస్ సర్కార్ పై షర్మిల ఫైర్

తెలంగాణలో పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న వైఎస్ షర్మిల.. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాటల దాడిని పెంచారు. హైదరాబాదులోని తన కార్యాలయంలో ముస్లింలతో ఈరోజు ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముస్లింల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి చాలా దారుణంగా ఉందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డుకు చెందిన 50 వేల ఎకరాల భూములు కబ్జాకి గురయ్యాయని చెప్పారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత దివంగత రాజశేఖరెడ్డిదేనని గుర్తు చేశారు.

ముస్లింలను తెలంగాణ ప్రభుత్వం ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని ఆరోపించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని హామీ ఇచ్చి, మోసం చేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలను హేట్ బ్యాంక్ గా వాడుకుంటోందని విమర్శించారు. మనందరం చేతులు కలిపితే తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకురావచ్చని షర్మిల చెప్పారు.

కాగా, తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలని వైఎస్ షర్మిల అంటున్నారు. అందులో భాగంగా కొత్త పార్టీ ఏర్పాటుపై అభిమానులు, నేతలతో వరసగా సమాలోచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఖమ్మంతోపాటు పలు జిల్లాల  అభిమానులతో వైఎస్ షర్మిల సమావేశం నిర్వహించారు. ఖమ్మంలో భారీ సభ నిర్వహించి.. పార్టీ విధివిధానాలను ప్రకటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement