Saturday, April 27, 2024

10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు: సీఎం జగన్

ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమలు తెచ్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇన్సెంటివ్స్‌ ఇస్తుందన్న నమ్మకం కలిగించాలని చెప్పారు. గతంలో హడావుడి ఎక్కువగా.. పని తక్కువగా ఉండేదన్నారు

పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడం వల్ల వారిలో నమ్మకం పెరుగుతుందని అన్నారు. మధ్యతరహా పారిశ్రామికవేత్తలను ఆదుకుంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. పరిశ్రమలను తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. పరిశ్రమల వల్ల స్థానికులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి లేనప్పుడు పారిశ్రామిక రంగం క్షీణిస్తుందని.. అలా కాకుండా ఉండేందుకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపడుతున్నట్లు తెలిపారు. వివక్ష, అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. పరిశ్రమలు, ఉపాధిని నిలబెట్టేందుకు పథకాలు ఉపయోగపడ్డాయని తెలిపారు. సంక్షేమ పథకాల అమలుతో.. కష్టాల్లోనూ పేదలను ఆదుకోగలిగామన్నారు.

ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలతో.. 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని, పరిశ్రమలకు ఊతమిస్తూ రూ.1124 కోట్లు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఎంఎస్‌ఎంఈలకు రూ.440 కోట్లు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్‌ మిల్స్‌కు రూ.684 కోట్లు ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. ఎంఎస్‌ఎంఈలకు ఇప్పటివరకు రూ.2,086 కోట్లు ప్రోత్సాహకాలిచ్చామని సీఎం జగన్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement