Saturday, May 4, 2024

యువతంత్రం – అసెంబ్లీ వైపు వార‌సుల చూపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ముఖ్యప్రతినిధి: ఈ ఏడాది జరిగే అసెంబ్లి ఎన్నికల్లో తమ పొలిటికల్‌ ఎంట్రీ పక్కాగా జరిగేలా కీలక నేతల వారసులు పావులు కదుపుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఇద్దరు వారసులు పోటీకి సై అంటున్నారు. నియోజకవర్గాన్ని రెండు భాగాలుగా చేసుకుని.. ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలను నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోచారం వారసుడి ఎంట్రీ ఖాయమన్న ప్రచారం నియోజకవర్గంలో ఉండగా, పెద్దాయన మొగ్గు ఎవరివైపు ఉందన్నది హాట్‌ టాపిక్‌గా మారింది. గులాబీ దళపతి కేసీఆర్‌కు ఇప్పటికే ఈ విషయమై చర్చించారు. అనేక నియోజకవర్గాల్లో ఇపుడు మంత్రులు, ఎమ్మెల్యేల వారసులు ప్రచార భారం, పనులు, పార్టీ కార్యక్రమాలన్నీ తమ భుజాల మీద వేసుకుని పనిచేస్తున్నారు. వారసులు పొలిటికల్‌ ఎంట్రీకి చేసుకుంటున్న సన్నాహాలు, ప్రయత్నాలు యువ క్యాడర్‌లో ఉత్సాహం నింపుతున్నాయి. సంస్థాగత పట్టు, కొత్తదనంతో యువమంత్రం ఫలిస్తుందని, నియోజకవర్గంపై పట్టు కొనసాగుతుందన్న అంచనాలో నేతలు ఉన్నారు. అయితే గులాబీ దళపతి కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అంశంపైనే గులాబీ పార్టీ యువనేతల ఎంట్రీ ఎపిసోడ్‌ ఆధారపడి ఉంది. బీజేపీలోనూ అనేకమంది సీనియర్‌ నేతలు.. ఇప్పటికే అసెంబ్లిd నియోజకవర్గాలు అప్పగించి తమ వారసులను రంగంలోకి దింపగా, కాంగ్రెస్‌లోనూ ఇదే సీన్‌ కొనసాగుతోంది.

ప్రచారం కూడా..

  • మల్కాజ్‌ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడి కోసం మెదక్‌ అసెంబ్లిdపై దృష్టిపెట్టారు. సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించే రోహిత్‌ ఇక మెదక్‌ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు ఉదృతం చేస్తారని మైనంపల్లి అక్కడి గులాబీ నేతలకు చెప్పారు. త్వరలో రోహిత్‌ ఎంట్రీ ఇవ్వనుండగా, ఇప్పటికే మెదక్‌ అసెంబ్లిd నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డిల మధ్య వర్గపోరు ఉంది. ఇపుడు మరో నేత ఎంట్రీని ఈ నేతలు ఎలా తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
  • మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌ రావు తనయుడు విజిత్‌ రావు నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన వారసుడిని రంగంలోకి దింపాలని ఎమ్మెల్యే కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు గులాబీనేతలు చెబుతున్నారు. అధినేత దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళారు. దివాకర్‌ రావు తనయుడు విస్తృతంగా ప్రజల్లో తిరుగుతున్నారు.
  • వరుస విజయాలతో కోరుట్లలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు వచ్చే ఎన్నికల్లో వారసుడిని పొలిటికల్‌ ఎంట్రీ చేసేందుకు రంగం సిద్ధం చేశాడన్న ప్రచారం నియోజకవర్గంలో ఉంది. ఇటీవల కాలంలో విద్యాసాగర్‌రావు తనయుడు కల్వకుంట్ల సంజయ్‌ తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతుండడం ఆసక్తి రేపింది. గత ఎన్నికల్లోనే సంజయ్‌ పోటీచేస్తాడని ప్రచారం జరిగినా అది కాలేదు. ఈసారి మాత్రం ఖాయమని అక్కడి నేతలు భావిస్తున్నారు.
  • కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌ రావు తనయుడు వికాస్‌రావు వచ్చే అసెంబ్లిd ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కొడుకు పొలిటికల్‌ ఎంట్రీని విద్యాసాగర్‌ రావు తీర్చిదిద్దుతున్నారు. వికాస్‌ ఇప్పటికే విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు.
  • మాజీ మంత్రి ఎంఎస్‌ఆర్‌ మనవడు రోహిత్‌ రావు వచ్చే ఎన్నికల్లో కరీంనగర్‌ అసెంబ్లి నుండి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీచేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
  • బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌ రెడ్డి తనయుడు మిధున్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో షాద్‌నగర్‌ అసెంబ్లి నుండి పోటీచేసేందుకు గ్రౌండ్‌ వర్క్‌ చేసుకుంటున్నారు.
  • ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ తనయుడు జయసింహ వచ్చే ఎన్నికలలో పోటీచేయాలన్న ఉత్సాహంతో గట్టిగా పనిచేస్తున్నారు. తండ్రి కూడా తనయుడిని ప్రోత్సహిస్తున్నారు.
  • శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడిని వచ్చే అసెంబ్లి ఎన్నికల బరిలో నిలిపేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లకు తన కోరికను చెప్పారు. వరంగల్‌ జిల్లాలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కుమార్తె కావ్య బరిలో నిలిచేందుకు రెడీగా ఉన్నారు. గత ఎన్నికల్లో ప్రయత్నించినా.. అధిష్టానం ఆదేశాలతో వెనక్కుతగ్గారు.
  • ప్రస్తుత హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి వచ్చే అసెంబ్లి ఎన్నికలలో పోటీచేయాలని డిసైడ్‌ అయ్యారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంపై ఆమె దృష్టి పెట్టారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement